గడచిన మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే…. రేపోమాపో తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని! తేదీలు మారుతున్నాయే తప్ప.. ఎంపిక ప్రక్రియపైన ఇంకా ఒక స్పష్టత రావడం లేదు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వరకూ కొనసాగుతా అన్నారు. ఆ ఎన్నికలో ఓటమి తరువాత, వెంటనే పదవి నుంచి తప్పుకుందామని అనుకున్నా… కొత్త అధ్యక్షుడిగా ఎవరి పేరును ఖరారు చెయ్యాలనే సందిగ్ధంలో హైకమాండ్ పడింది. ఎంపీ రేవంత్ రెడ్డి పేరు బలంగా వినిపించినా, ఆయన్ని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం… టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు మరో రెండు నెలలు పట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
ఈ ఆలస్యానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది… మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉండటం. తెలంగాణలో వరుస ఓటములతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనైనా సొత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో పీసీసీకి ఒక నాయకుడిని ఎంపిక చేస్తే, మిగతా నాయకుల్లో అసంతృప్తి భగ్గుమంటుంది. ఇప్పటికే పీసీసీ పీఠం కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాని ప్రభావం మున్సిపోల్స్ మీద కచ్చితంగా పడుతుంది. కాబట్టి, మున్సిపల్ ఎన్నికల్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతనే కొనసాగించెయ్యాలనే ఆలోచనలో హైకమాండ్ ఉందంటున్నారు. ఇక, కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం కావడానికి రెండో కారణం… రాహుల్ గాంధీ!
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతల్నుంచి తప్పుకున్నారు. తాత్కాలికంగా పార్టీ బాధ్యతల్ని సోనియా గాంధీ చూస్తున్నారు. అయితే, పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు మళ్లీ చర్చ మొదలుపెట్టారు. అధ్యక్ష బాధ్యతలు ఆయనకే ఇవ్వాలనీ, పార్టీకి భవిష్యత్తు ఆయనే అనే వాదనని మళ్లీ తెరమీదికి తెస్తున్నారు. అందరూ నచ్చజెబితే రాహుల్ వింటారని అంటున్నారు. ఈ చర్చ ఒక కొలీక్కి రావాలంటే మళ్లీ కొంత సమయం పడుతుంది. రాహుల్ కి ఏఐసీసీ పగ్గాలు వచ్చిన తరువాతే తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి, టీపీసీసీ పదవి ఇప్పట్లో తెగే వ్యవహారంలా లేదు. ఈలోపు ఆశావహులు బయోడేటాలను హైకమాండ్ కి వరుసపెట్టి పంపుతున్నారు. తాజాగా పొన్నం ప్రభాకర్ కూడా తనకి పీసీసీ పగ్గాలు ఇవ్వాలంటూ అర్హతల్ని హైకమాండ్ తెలియజేసి వచ్చారు! రేవంత్ తోపాటు, కోమటిరెడ్డి, దామోదర్ రాజనర్సింహ… ఇంకా చాలామందే ఆశావహులున్నారు.