గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాతి పరిణామాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంత కాలం అతడికి సహకరించిన వారు, అతడి దోస్తీతో కోట్లు సంపాదించిన వారు హడలిపోతున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారుల జాతకాలు కూడా నయీం డైరీలో లభించినట్టు సమాచారం.
దందాలతో ఈ మాఫియా డాన్ సంపాదించిన మొత్తం వేల కోట్లలో ఉంటుందనే అనుమానాలు నిజమేనని భావించాల్సి వస్తోంది. రెండు రోజులుగా నయీం ఆస్తులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. అతడి బంధువులు, అనుచరులను అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని పుప్పాల గూడలో నయాంకు ఇల్లుంది. అందులో సోదా చేసిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. కోట్ల రూపాయల నగదు, వందలాది దస్తావేజులు లభించాయి.
హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో నయీంకు 69 ఎకరాల స్థలం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ ఎకరా కోట్ల రూపాయల్లో ఉంటుంది. నగరంలో చాలా చోట్ల వందల ఎకరాలు నయీం పేరు మీద ఉన్నాయి. వాటి డాక్యుమెంట్లు అతడి ఇంట్లో లభించాయి. కిలోలకొద్దీ బంగారం, రెండు డైమండ్ వాచీలు, పిస్తోళ్లు పుప్పాల గూడ ఇంట్లో లభించాయి. నయీం కోటి రూపాయలకు కొన్న ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు.
నల్గొండ జిల్లా భువనగిరి చుట్టుపక్కల కనిపించే స్థలమంతా నయీందేనా అనే స్థాయిలో కబ్జాలు చేశాడు. నగరంలో, శివార్లలోనూ వేల ఎకరాలను చెరబట్టాడు. వాటికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లను పరిశీలించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నయీం డైరీలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. తనకు సహకరించే వారి వివరాలను కూడా డైరీలో రాసుకున్నాడని సమాచారం. ప్రతి విషయాన్ని డైరీలో రాసుకునే అలవాటు అతడికి ఉండేదట. ఇప్పుడు ఆ అలవాటు వల్లే అతడికి సహకరించిన పెద్దల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.
నయీం బంధువులు, అనుచరుల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాబడితే ఇంకా భారీగా ఆస్తులు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు, నయీం కబ్జా చేసిన భూముల యజమానులు సంతోషిస్తున్నా, అనుమానం వీడలేదు. తమ భూములు తమకు దక్కినట్టేనా అంటే సరైన సమాధానం రావడం లేదు. పోలీసులు నాలుగు రోజులు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోక పోతే, నయీం అనుచరులు మళ్లీ కబ్జాల దందా కొనసాగిస్తారేమో? ఇదే భయం వెంటాడుతోంది. అలా కాకుండా మీ స్థలాలు మీవే, మీజోలికి ఎవరూ రాకుండా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తేనే ఇంత పెద్ద ఆపరేషన్ కు సార్థకత.