రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టలన్నీ.. టిక్కెట్ల ఖరారు కోసం కసరత్తు చేస్తున్నాయి. సహజంగానే ఆయా పార్టీల్లో ఆయారాం.. గయారాంల హడావుడి కనిపిస్తోంది. గెలిచే పార్టీలో చేరేందుకు చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీ లో అయితే తమ భవిష్యత్ బాగుటుందని అనుకుంటున్నారో .. ఆ పార్టీ వైపు.. నేతలు ఆశగా చూస్తున్నారు. అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చేరికల విషయంలో తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి .. కూడా.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు.. రంగంలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దిగ్గజాలనే నేతలు ఎదురు చూస్తున్నారు. వీరంతా పెద్ద నేతలే కావడంతో.. వీటికి పోటీకి నియోజకవర్గాలు చూపించాల్సి ఉంటుంది. అందుకే చేరికలు ఆలస్యమవుతున్నాయి.
మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. వీరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేతను కలిశారని.. టీడీపీలో చేరేందుకు సంసిద్ధతను కూడా వ్యక్తం చేశారని … ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడో రేపో వీరు సైకిలెక్కడం ఖాయమేనంటున్నారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత దాడి వీరభధ్రరావు కూడా.. తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆసక్తితో ఉన్నారు. గతంలో.. ఆయన పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించినా.. ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇక పోటీకి అవకాశం లేకపోయినా… వైసీపీలో నిరాదరణకు గురయిన పలువురు సమన్వయకర్తలు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఇక కోస్తా ప్రాంతంలోనూ పలువురు వైసీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. రాయలసీమలోనూ.. కొంత మంది సీనియర్ నేతలు ఏ పార్టీలో లేకుండా ఖాళీగా ఉన్నారు. డీఎల్ రవింద్రారెడ్డి లాంటి నేతలు.. టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సినీ ప్రముఖులు ఆదిశేషగరిరావు, అలీ కూడా.. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో మాత్రం.. కొత్తగా ఏ జిల్లాలనూ చేరికల హడావుడి కనిపించడం లేదు. కడప జిల్లా టీడీపీ తరపున గెలిచిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. వైసీపీలో చేరారు. ఉత్తరాంధ్రలో కానీ.. కోస్తా జిల్లాల్లో కానీ.. రాయలసీమలో కానీ.. వైసీపీలో ఫలనా నేత చేరబోతున్నారన్న ప్రచారం లేదు. దీనికి కారణం.. జగన్మోహన్ రెడ్డి… పార్టీ చేరేందుకు ఆసక్తి చూపించిన వారికి.. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ లేదని ముందే చెబుతున్నారంటున్నారు. అవకాశం ఉన్న చోట.. తానే పిలిచి టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారు. హిందూపురం, చిలుకలూరిపేట, పెదకూరపాడు సహా అనేక నియోజకవర్గాల్లో పెద్దగా పేరు లేని నేతల్ని కూడా పిలిచి పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఖరారు చేశారు. పర్చూరు లాంటి నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులు ఉన్నారని.. అక్కడ బలమైన అభ్యర్థుల కోసం.. ప్రముఖ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నా.. చర్చలకు తెర పడటం లేదు. చాలా చోట్ల చేరికలు, అభ్యర్థిత్వాల విషయంలో ఆర్థిక సమీకరణాలు మాత్రమే ఉన్నాయని విమర్శలు వస్తున్నా.. జగన్ మాత్రం.. పార్టీలోకి ప్రముఖ నేతల్ని చేర్చుకునే ప్రయత్నాలేమీ చేయడం లేదు.