పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రమంత్రి వర్గంలో మార్పులూ చేర్పులూ ఉండే అవకాశాలున్నాయి. ఈ మార్పుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే సూచనలున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యాక కేబినెట్ లో ఉండబోయే మార్పులపై భాజపా తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి వెళ్లబోతున్న తరుణంలో.. ఒక బలమైన నాయకుడు భాజపాకి కూడా దూరమైనట్టే. కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా వ్యవహారాల్లో వెంకయ్య కీలకపాత్ర పోషించారు. కాబట్టి, ఇప్పుడు మూడో మంత్రి పదవి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం సహాయమంత్రిగా ఉన్న సుజనా చౌదరికి, కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం పరిశీలనలో ఉన్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో వెంకయ్య నాయుడు స్థానం భర్తీ చేసేందుకు.. ఒక బలమైన నాయకుడి కోసం భాజపా అన్వేషిస్తున్నట్టు సమాచారం.
ఉప రాష్ట్రపతి కాబోతుండటంతో కేంద్రమంత్రి పదవితోపాటు, భాజపాకి కూడా వెంకయ్య రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఇదే స్థానం నుంచి రామ్ మాధవ్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఆయన భాజపాతోపాటు ఆర్.ఎస్.ఎస్.లో కూడా ఎంతో చురుగ్గా ఉన్న నాయకుడు. ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో భాజపాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా రామ్ మాధవ్ కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈయన ఆర్.ఎస్.ఎస్. అధికార ప్రతినిధిగా చాన్నాళ్లు పనిచేసి.. తరువాత భాజపా అధికార ప్రతినిధి అయ్యారు. ఈయన తెలుగువారు కావడం గమనార్హం.
ఇక, తెలంగాణకు సంబంధించిన మరో కీలక నిర్ణయంపై కూడా భాజపా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో కూడా భాజపా పాగా వేసేందుకు ప్రయత్నాలు ఆరంభించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై కొంత పట్టు సాధించేందుకు అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే కొన్ని వ్యూహాలతో ఉన్నట్టు ఈ మధ్య కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో మరో ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు కూడా క్యాబినెట్ లో చోటు కల్పించే ఛాన్సు ఉందని అంటున్నారు. ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం భాజపా అధినాయకత్వానికి ఉందని తెలుస్తోంది.ఏదేమైనా, ఈ పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే మంత్రి వర్గ మార్పులపై కీలక ప్రకటన వెలుడుతుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక మార్పులు ఉండటం ఖాయంగానే అనిపిస్తోంది.