రాజమౌళి సినిమా అంటే.. ఇప్పుడు రూ.1000 కోట్ల బడ్జెట్ మినమం ఉండాల్సిందే. దానికి రెట్టింపు రాబట్టుకోవడం ఎలాగో రాజమౌళికి కూడా బాగా తెలుసు. అందుకే రాజమౌళి సినిమాకి ఎంత బడ్జెట్ పెడుతున్నా – అదేం భారంగా అనిపించదు. రాజమౌళి – మహేష్‌బాబు కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాకి దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు టాక్. అదే నిజమైతే… మన దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా ఇదే అవుతుంది. కె.ఎల్.నారాయణ ఈ చిత్రానికి నిర్మాత. అయితే.. రాజమౌళికి ఆయనొక్కడిపైనే భారం వేయడం ఇష్టం లేదు. అందుకే.. రాజమౌళి సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనున్నార్ట. ఆయనకు పారితోషికం అంటూ ఏం ఉండదు. లాభాల్లో వాటా తీసుకొంటారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో ఇద్దరు నిర్మాతలు కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్కా మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అందుకోబోతున్నట్టు సమాచారం. వాళ్లిద్దరూ తెర వెనుక ఉంటారా? లేదంటే అఫీషియల్‌గానే నిర్మాతలుగా వ్యవహరిస్తారా? అనేది చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఈ యేడాది చివర్లో కానీ, 2024 ప్రధమార్తంలో కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.