తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. తన పార్టీ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. తన పార్టీ తరపున ప్రకటించిన 105 మంది అభ్యర్థులు.. ప్రజల్లోకి వెళ్లి ఏమి చెప్పుకోవాలో తెలియక తంటాలు పడుతూంటే… వారి కోసం.. ఉన్న పళంగా.. మేనిఫెస్టో కమిటీ నివేదిను తీసుకుని.. అందులో నుంచి ప్రజాకర్షక పథకాలను.. బయటపెట్టారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు సహా చాలా ఉన్నాయి. ఇవి.. కేవలం ఒక భాగమేనని.. కేసీఆర్ ప్రత్యేకంగా ప్రకటించారు. ఎన్నికల సమయానికి పూర్తి స్థాయి మేనిఫెస్టో బయటకు వస్తుంది. ఎందుకు.. పాక్షికంగా ప్రకటించారు…? అంటే.. దానికి రాజకీయ.. ఓట్ల పరమైన కారణాలు చాలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీల్లో అత్యంత ప్రధానమైనది రుణమాఫీ. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇస్తున్నది కాదు. రాహుల్ గాంధీ ఇస్తున్నది. జాతీయ స్థాయిలో రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. రాహుల్‌ను నమ్మడానికి రైతులు సిద్ధంగానే ఉంటారు.
ఎందుకంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ ఎంత సాఫీగా సాగిపోయిందో.. రైతులకు ఇప్పటికీ గుర్తు ఉంది. కానీ కేసీఆర్ చేసిన రుణమాఫీ.. ఎవరికి అందిందో.. ఎవరికీ తెలియదు. వచ్చిందో.. వచ్చిన మొత్తం వడ్డీకే పోయిందో.. అర్థం చేసుకోలేకపోయారు. అందుకే రుణమాఫీ జరిగిందని.. ఎవరూ నమ్మడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇతర హామీలు కూడా… దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. పెన్షన్, నిరుద్యోగభృతి విషయంలోనూ అంతే. ఈ రెండింటిని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ దూకుడుని బట్టి… మిగతా భాగం వరాల్ని.. కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తనకు వంద సీట్లు వస్తాయని పదే పదే చెబుతున్న కేసీఆర్.. మరి కాంగ్రెస్ పార్టీతో పోటీ పడి.. ఎందుకు వరాలు ప్రకటిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి పాలనలో కానీ.. రాజకీయ వ్యూహాల్లో కానీ.. పూర్తిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఫాలో అయ్యారు. దానికి తగ్గట్లుగానే వైఎస్ రెండో సారి గెలిచినప్పుడు.. అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించేశారు.
కేసీఆర్ కూడా అలాగే ప్రకటించారు. కానీ అప్పట్లో వైఎస్ఆర్ .. కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇచ్చినా నమ్మేవాళ్లు కాదని…అది మైనస్ అవుతుందని ఆయన ఇవ్వలేదు. పీఆర్పీ, లోక్‌సత్తా ఓట్లు చీల్చడంతో బయటపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం.. వరాల మూట విప్పుతున్నారు. ఇంత కాలం.. ఆయన ఇచ్చిన కేటీ టు పీజీ దగ్గర్నుంచి డబుల్ బెడ్ రూం వరకూ అనేక పథకాలు చూశారు కాబట్టి..నమ్మడానికి ప్రజలు అంత సిద్ధంగా లేరనే విశ్లేషణలు ఎక్కువగానే వస్తున్నాయి. అధికార పార్టీకి ఉండే సమస్యే అది. దీన్ని కేసీఆర్ అధిగమించే దాన్ని బట్టే ఫలితాలుంటాయి.