ఒకప్పుడు దేశంలో పనామా సిగరెట్స్ చాలా ఫేమస్. మళ్ళీ ఇప్పుడు కూడా పనామా పేరు యావత్ ప్రపంచం మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వ్యవహారం అసమాన్యులకి సంబంధించినది…కోట్లాది రూపాయల వ్యవహారాలతో ముడిపడి ఉన్నది కావడంతో అంత హిట్ అయ్యింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ న్యూస్ పేపర్ బయటపెట్టిన మొట్టమొదటి పనామా జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యా బచ్చన్ పేర్లు వినిపించాయి. వారిరువురూ పనామాలోని మోసాక్ ఫోనేక్సా కంపెనీ సహాయంతో విదేశాలలో నకిలీ కంపెనీలు సృష్టించి వాటిలోకి తమ డబ్బుని మళ్ళించారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టింది. ఆ ఆరోపణలను వారిరువురూ ఖండించారు. తనకు తెలియకుండా ఎవరో తన పేరును ఉపయోగించుకొని ఉండవచ్చని, ఆ సంస్థల గురించి తానెప్పుడూ వినలేదు కూడా అని అమితాబ్ బచ్చన్ మీడియాకి తెలిపారు. కానీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ మళ్ళీ తాజాగా ఆయన ప్రమేయం ఉన్నట్లు నిరూపించే కొన్ని రహస్యాలను బయటపెట్టింది.
ఆయన బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో సి బల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్, బహమ్మాస్ లోని లేడీ షిప్పింగ్ లిమిటెడ్, ట్రంప్ షిప్పింగ్ లిమిటెడ్ కంపెనీలకు 1993 నుంచి 1997 వరకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరించినట్లు బయటపెట్టింది. వాటి డైరెక్టరుగా ఆయన ఆ కంపెనీల బోర్డు మీటింగులో స్వయంగా కొన్నిసార్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కొన్ని సార్లు పాల్గొన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టింది. 1994 డిసెంబర్ 12న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగులో ఆయన స్వయంగా పాల్గొనట్లుగా వారెంట్స్ సెక్రటరీస్ సంస్థ జరీ చేసిన ఇన్ కంబెన్సీ సర్టిఫికేట్ ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టింది. దానిలో మిగిలిన అందరి కంటే అమితాబ్ బచ్చన్ పేరే పైనుంది. ఆయన కాకుండా మరో ఐదుగురు సభ్యులు అందులో సంతకాలు చేసినట్లు స్పష్టంగా ఉంది. వారందరూ తలో వెయ్యి షేర్లు కొన్నట్లు దానికి పూర్తి సొమ్ము ముట్టినట్లు అందులో ఉంది.
దేశాప్రజలందరూ అమితంగా ఇష్టపడే గొప్ప నటుడు, అందరి దృష్టిలో చాలా గౌరవం గల అమితాబ్ బచ్చన్ వంటి వ్యక్తి కూడా సినిమాల ద్వారా తను సంపాదించిన డబ్బుకి పన్ను కట్టవలసి వస్తుందనే భయంతో ఈవిధంగా విదేశాలలో నకిలీ కంపెనీలు సృష్టించుకొని దానిలోకి తన డబ్బుని తరలించడం అందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈసారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిన ఈ వివరాలను చూసి అమితాబ్ బచ్చన్ ఏవిధంగా సమర్ధించుకొంటారో చూడాలి.