ఎట్టకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రియల్ పొలిటికల్ ఎంట్రీకి మార్గం సుగమం అయింది! ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో చినబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నుకునేందుకు తీర్మానించారు. శాసన మండలి సభ్యుడిగా లోకేష్ ఎన్నిక కేవలం లాంఛనం మాత్రమే. ఇక, జరగబోయేది లోకేష్‌కు మంత్రి పదవి అప్పగింత!
గడచిన ఏడాదిగా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చినబాబు కోసం కొంతమంది పదవీ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు! ఏదైతేనేం… ఇన్నాళ్లకు లైన్ క్లియర్ అయిపోయింది. అయితే…లోకేష్‌ను మంత్రిని చేయడంతోనే చంద్రబాబుకు కొత్త సవాల్ స్వీకరణకి సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పొచ్చు. లోకేష్‌కు కీలకమైన మున్సిపల్, ఐటీ శాఖల బాధ్యతల్ని అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో ఆ శాఖల ద్వారా మెరుగైన ఫలితాలు లోకేష్ సాధించాలి. గణనీయమైన అభివృద్ధిని చూపించాలి. ఓ రకంగా లోకేష్‌కు అప్పగించే శాఖల్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా చంద్రబాబుపై ఉంటుంది కదా!
వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ను పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా తయారు చేయాలంటే… ముందు మంత్రిగా సక్సెస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మండలి ద్వారా లోకేష్‌ను క్యాబినెట్లోకి తీసుకొస్తున్నారుగానీ.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేగా పోటీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్‌ను ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి… పోటీకి దిగడం తప్పకపోవచ్చు! సో.. ఇవన్నీ చంద్రబాబు మీదున్న బాధ్యతలుగానే చెప్పుకోవాలి.
ఇప్పట వరకూ సీఎం కుమారుడుగా మాత్రమే లోకేష్ పార్టీలో గుర్తింపు సాధించుకున్నారు. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న సందర్భాలు ఇంతవరకూ లేవు. గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టినా… మధ్యలోనే కాడె వదిలేశారు. తెలంగాణలో పార్టీకి గడ్డు రోజులు రావడంతో, ఆంధ్రాపై ఫోకస్ అంటూ అటు వెళ్లిపోయారు. మళ్లీ చంద్రబాబు జోక్యం చేసుకుంటేనే తెలంగాణ టీడీపీలో కాస్తైనా కదలిక వచ్చింది. సో.. లోకేష్‌కు ఇంకాస్త రాజకీయ అనుభవం అవసరం అనేది ఇక్కడే అర్థమౌతోంది. ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టినా కూడా,ల వెనకుండి వేలుపట్టుకుని నడిపించాల్సింది చంద్రబాబు నాయుడే. ఆ రకంగా చినబాబు మంత్రి పదవి చంద్రబాబుకు మరో సవాలుగా మారుతోందని చెప్పాలి.