ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెలాంటి స్టార్లు ఇప్పటికే ఈసినిమాలో చేరారు. ఈ ప్రవాహం ఇక్కడితో ఆగిపోవడం లేదు. త్వరలోనే మరికొంత మంది స్టార్లు ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ, మలయాళ చిత్రసీమ నుంచి ఒక్కో అగ్ర కథానాయకుడు ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం. తెలుగు నుంచి కూడా ఓ ప్రముఖ నటుడు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రమిది. అన్ని భాషల వారినీ ఆకట్టుకోవాలి. అందుకే… వివిధ భాషలకు చెందిన నటీనటులకు ఈ సినిమాలో చోటు కల్పించబోతున్నారు. చిన్న పాత్రని సైతం.. పేరున్న నటులకే అప్పగిద్దామని డిసైడ్ అయ్యారు. ఒక్కొక్కరి పేరు… ఒక్కోసారి ప్రకటిస్తూ, ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న చిత్రమిది. అందులో సగం పారితోషికాలకే సరిపోయేటట్టుంది. పరిస్థితి చూస్తుంటే… స్టార్లు ఎంట్రీ ఇచ్చే కొద్దీ క్రమంగా ఈ సినిమా బడ్జెట్ కూడా పెరిగే అవకాశాలున్నాయనిపిస్తోంది.