కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేస్తోంది. ఏప్రిల్ ఒకటి నుండి అంతా కొత్తగా ఉంటుంది. ఎంత కొత్తగా అంటే.. బతుకు ఇంత భారమా అని అనుకోవడం ఖాయం. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో రేట్లు పెరిగాయో లేదో కానీ ఇండియాలో మాత్రం ఉప్పులు పప్పుల దగ్గర్నుంచి అన్నింటినీ పెంచేశారు. కరోనా దెబ్బకు అతలాకుతలం అయిన జనం ఇప్పుడు యుద్ధం దెబ్బకి ఫ్రై అయిపోతున్నారు. ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వస్తుంది… కానీ ఇండియాలో అన్ని రకాల ఆయిల్స్ రేట్లను పెంచేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి
ఇక పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకు రూపాయి చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం బిగబట్టిన పెంపు.. మొత్తం ఇప్పుడు బాదేస్తున్నారు. మరో వైపు యుద్ధం… ఏడాదికి పెట్రో ఉత్పత్తులపై రూ. మూడు, నాలుగు లక్షల కోట్ల పన్నులు వసూలు చేస్తున్న కేంద్రం.. వాటిని తగ్గించుకునేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామని రూ. నలభైకే లీటర్ పెట్రోల్ వస్తుందని ఉబ్బేసి.. వారం కాక ముందే… ఏమీ చేయలేమని కేంద్రమంత్రులు చెబుతున్నారు. ఇక గ్యాస్ బండలు మీదేయడం ప్రారంభించి చాలా కాలం అయింది. ముఫ్పై రూపాయల సబ్సిడీ మొహం మీద కొడుతున్నారు. కొత్తఏడాదిలో అది కూడా ఉండకపోవచ్చు.
తాజాగా ప్రాణాధార మందులపై ఏకంగా పది శాతం పెంపును ప్రకటించారు. చివరికి పేదవాడికి ఏదొచ్చినా మందు బిళ్లగా ఉపయోగపడే పారాసిటమాల్పైనా బాదేశారు. అంటే.. సామాన్యుడి ఆరోగ్య బడ్జెట్ కూడా పెరగనుందన్నమాట. ఇప్పటికే ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. చిన్న వ్యాపారులు.. రోజు కూలీలు.. చిరుద్యోగులు అంతా సతమతమవుతున్నారు. ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు. అయినా కేంద్రం కనికరించడం లేదు. మార్కెట్ పరిస్థితుల్ని గాలికొదిలేసి.. తమ ఆదాయంమే గొప్ప అభివృద్దిగా ప్రచారం చేసుకుంటూ ఉంది. దీనిపై ఎవరూ ఏమీ చేయలేరు.. ఎందుకంటే కోరి తెచ్చుకున్న కొరివి మరి.. !