ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఇచ్చిన తీర్పు చూసి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని రాజకీయ పార్టీలకు తమ భవిష్యత్ పై బెంగ పెట్టుకునేలా చేశాయి. మరికొన్ని పార్టీలకు పాతికేళ్ల పాటు తిరుగులేదన్న భరోసా కల్పించాయి. ఎవరూ ఊహించనంత మెజార్టీలు రావడమే దీనికి కారణం. ప్రత్యర్థులకు కనీస ఓట్లు దక్కలేదు. ఈ ఫలితాలపై రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఏపీలో ఇంత ఏకపక్ష రాజకీయం ఎందుకు ఏర్పడిందన్నదానిపై విశ్లేషణలు చేస్తున్నారు.
పట్టభద్రుల్లో అరవై శాతం కూటమి వైపు
ఏపీలో జరిగిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లు అరవై శాతం ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులకు మద్దతు పలికారు. మరో ఆలోచన రానివ్వలేదు. అందుకే ద్వితీయ ప్రాధాన్యం అన్న మాటే రాలేదు. ఇంకా లెక్కింపు మిగిలి ఉండగానే విజయానికి అవసరమైన ఓట్లు సాధించారు. మొత్తంగా రెండు చోట్ల అరవై శాతానికిపైగా ఓట్లు కూటమి అభ్యర్థులకు వచ్చాయి. ఇంత ఏకపక్షంగా ఓటింగ్ ఉంటుందని కూటమి పార్టీలు కూడా అనుకోలేదు.కాస్త గట్టి పోటీ ఉంటుందని అనుకున్నారు. తాము పోటీ చేయకుండా ఇతర పార్టీలను గెలిపిద్దామని వైసీపీ ప్రయత్నం చేయడమే దీనికి కారణం.
ఓటర్లలో వైసీపీ భయం
వైసీపీ ఏ స్థాయిలోనూ మద్దతు పలికినా తమ జీవితం నాశనం అయిపోతుందని ఓటర్లు భయపడుతున్నారు. అందుకే కూటమికి పూర్తి సపోర్టుగా నిలిస్తున్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్ల పాటు వారి రక్త మాంసాలు పీల్చినా వైసీపీ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ పోటీలో లేకపోయినా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేద్దామన్న ఆలోచన కూడా రానివ్వడం లేదు. టీడీపీకి వ్యతిరేకంగా వేసే ఓటు వైసీపీని బలపరుస్తుందన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందని ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ట్రెండ్ చూపిస్తోంది. ఒక్కో స్థానంలో 80వేలకుపైగా మెజార్టీ రావడమే దీనికి సాక్ష్యం.
కూటమిగా ఉంటే ఎవరూ ఓడించలేరు !
కూటమి ఊహించనంత బలంగా ఉంది. ఎంతగా ఉంటే.. కూటమిగా ఉన్నంత కాలం ఇతర పార్టీలకు ప్రతిపక్ష హోదా వస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. పథకాలు అని.. కులాలు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నా… ప్రజలు నమ్మడం లేదు. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం పని చేస్తున్న విధానం కూడా నచ్చుతోంది. అందుకే కూటమి కలిసి ఉన్నంత కాలం ఏపీలో మరో పార్టీకి చాన్స్ ఉండదని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తేల్చి చెప్పాయి.