అమరావతి కో సం రైతులు ఇచ్చిన భూముల్లో రెండు వేల ఎకరాలకుపైగా భూములు కనిపించకుండా పోయాయి. అసలు రికార్డుల్లో లేవు. అడ్డగోలుగా రికార్డులు మార్చేసి ఆ భూములు లేవని చూపిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ జరిగిన సమయంలో తొలి సంవత్సరం 28,654 మంది రైతులు 34,398 ఎకరాలు పూలింగు రూపంలో ఇచ్చారు. ప్రభుత్వ భూములు మరో 15 వేల ఎకరాల వరకూ తీసుకున్నారు. మొత్తం 53 వేల ఎకరాలు రాజధాని పరిధిలో సిఆర్డిఎ చేతుల్లోకి వెళ్లింది.
సీఆర్డీఏలోని 9.14 అగ్రిమెంటు ప్రకారం రైతులు ఇచ్చింది 34,398 ఎకరాలు. ఇది పూర్తిగా రైతుల వద్ద నుంచి సిఆర్డిఎ అధికారులు సర్వేచేసి దగ్గరుండి అగ్రిమెంటు చేయించుకున్న భూమి. ఇప్పుడు రికార్డుల్లో 32,059 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు 2,339 ఎకరాలు రికార్డుల్లో నుండి తొలగిపోయింది. ఇంత పెద్దఎత్తున భూములు ఎలా మాయం అయ్యాయనేది ప్రశ్నగా మారింది. సాధారణంగా ఒక ఎకరా లేదా నాలుగైదు ఎకరాలు తేడా రావొచ్చని, కానీ ఏకంగా 2,339 ఎకరాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్న వస్తోంది.
సిఆర్‌డిఎకు అప్పగించిన తరువాత భూములు ఏమైనా చేసుకోవచ్చని, కానీ తాము ఇచ్చిన భూమే తగ్గిందని చూపించడం వెనుక కుట్ర ఉందని రైతులు అంటున్నారు. పూలింగులో తీసుకున్న భూముల స్థితి మారినా ఇంత పెద్దఎత్తున తేడా రాదని, దీనివెనుక భారీ కుంభకోణం ఉందని, విచారణ జరిపించాలని కోరుతున్నారు. సీఆర్డీఏలో చేరిన ఓ ప్రత్యేక అధికారి.. అదికార పెద్దలతో కలిసి ఈ స్కాం చేశారన్న అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలో ఈ స్కాం బయటపడే అవకాశం కనిపిస్తోంది.