తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీల్లోని కీలక వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా… దాని వెనుక ఉన్న అర్థమేమిటా అని వెదుక్కోవడం ప్రారంభమయింది. తాజాగా.. జగిత్యాలలో పర్యటించిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సమీకరణాలు మారుతాయని… రాజకీయాలు ఆసక్తికరంగా మారుతాయని వ్యాఖ్యానించారు. ఏది జరిగినా టీఆర్ఎస్కే మంచి జరుగుతుందని.. అనేక అంశాలు చర్చకు వస్తాయని ప్రకటించారు.
కవిత అంతకు మించి ఎక్కువ వ్యాఖ్యలు చేయలేదు.. కానీ అందులోనే చాలా పరమార్థం ఉంది. అదేమిటన్నది టీఆర్ఎస్ నేతలకే అంతుబట్టడం లేదు. ఈటల రాజేందర్ నిష్క్రమణ తర్వాత టీఆర్ఎస్లో బీసీ నేతల చేరికలకు కేసీఆర్ వ్యూహం పన్నారు. అందులో భాగంగా ఎల్.రమణను ఆహ్వానిస్తున్నారు. అయితే… ఇదే చివరి ట్విస్ట్ కాదని.. ఇంకా చాలా చాలా జరగబోతున్నాయని కల్వకుంట్ల కవిత నేరుగానే చెప్పేశారు. ఆ చాలాచాలా ఏమిటనేదే ఇప్పుడు ఆసక్తికరం.
కేటీఆర్కు పీఠం అప్పగించే వ్యూహంలో భాగంగా కేసీఆర్ తోక జాడించే వారినందర్నీ మెల్లగా నిర్వీర్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఆ క్రమంలో తర్వాతి పేరు జగదీష్ రెడ్డిదిగా కొంత కాలంగా ప్రచారం లో ఉంది. అయితే ట్విస్టులు అంతటితో ఆగే చాన్స్ లేదు. ఇటీవలి కాలంలో కవిత పేరు కూడా తరచూ ప్రచారంలోకి వస్తోంది. ఆమెకు కూడా కీలకమైన పదవి దక్కబోతోందని అంటున్నారు. ఈ క్రమంలో కవిత చెబుతున్న రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయోనన్న చర్చలు సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయ్యాయి.