ఏపి తెదేపా అధ్యక్షుడు కళావెంకట్రావు తిరుపతిలో నిన్న మీడియాతో మాట్లాడుతూ తెదేపా హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందినట్లయితే, భవిష్యత్తులో వైకాపా ఉనికి కోల్పోతుందనే భయంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. కళా వెంకట్రావు చెపుతున్న దాని ప్రకారం చూస్తే బీజేపీ కూడా అదే భయంతో రాష్ట్రానికి తగినంత సహాయం చేయడానికి వెనుకాడుతోందేమోనని అనుమానించవలసివస్తోంది.
కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులు, వాటితో రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెదేపా ప్రభుత్వం తన పద్దులో వ్రాసుకొంటోందని, న్యాయంగా తమ పార్టీకి దక్కవలసిన క్రెడిట్ దక్కనీయకుండా చేస్తోందని రాష్ట్ర బీజేపి నేతలు తరచూ ఆరోపణలు చేయడం వింటూనే ఉన్నాము. రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా తెదేపా అడ్డుపడుతోందని కూడా వారు ఆరోపిస్తున్నారు. రాజమండ్రిలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ “కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇంతవరకు ఎంత సహాయం చేసిందో లెక్కలు చెప్పడానికే తను వచ్చేనని చెప్పి, ఇంతవరకు రాష్ట్రంలోని వివిద పధకాలు, ప్రాజెక్టుల కోసం కేంద్రప్రభుత్వం మొత్తం రూ 1.40 లక్షల కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రివర్గం ఏ ఒక్కమంత్రి కూడా ఈ విషయాన్ని ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు. లేదా చెప్పుకోవడానికి ఇష్టపదలేదనుకోవాల్సి ఉంటుంది. బహుశః అందుకే రాష్ట్రానికి ఇచ్చిన హామీలనన్నిటినీ అమలుచేసేందుకు కేంద్రప్రభుత్వం వెనుకాడుతోందేమో?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను ఒక్కడే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకొంటారు. తను స్వయంగా ఆ ఫైళ్ళు పట్టుకొని అమెరికాలోని వీధులలో తిరిగి ప్రముఖ సంస్థల అధినేతలను కలిసి, వారిని ఒప్పించి వారిచేత హైదరాబాద్ ఐటి పరిశ్రమలు స్థాపింపజేశానని చాలాసార్లు చెప్పుకొన్నారు. కానీ అది తమ ప్రభుత్వం సమిష్టి కృషి అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. దాని కోసం అనేకమంది మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వోద్యోగులు, ప్రవాసభారతీయులు తెర వెనుక చేసిన కృషి గురించి ఆయన ఎన్నడూ చెప్పరు. లేదా చెప్పడానికి ఇష్టపడరు.
పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చొన్న తరువాత తన మైండ్ సెట్ పూర్తిగా మార్చుకొన్నానని ఆయన చాలాసార్లు చెప్పుకొన్నారు కానీ హుద్ హూద్ తుఫాను సహాయ చర్యలు, గోదావరి పుష్కరాలు, రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం వంటి కార్యక్రమాలలో పూర్తి క్రెడిట్ తనే స్వంతం చేసుకోవడాన్ని గమనిస్తే నేటికీ ఆయన మైండ్ సెట్ మారలేదని రుజువవుతూనే ఉంది. మరి ఆయన ఈవిధంగా వ్యవహరిస్తున్నప్పుడు, రాజధాని, పోలవరం నిర్మాణం, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటివన్నీ పూర్తి చేయడానికి కేంద్రప్రభుత్వం సహాయం చేసినట్లయితే, ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు తన జేబులోనే వేసుకొంటారు తప్ప కేంద్రంతో, రాష్ట్రంలో బీజేపీతో, చివరికి తమ మంత్రివర్గం, అధికారులతో పంచుకొంటారని ఆశించలేము.
తన సమర్ధను, అనుభవాన్ని చూసే రాష్ట్ర ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారని ఆయనే స్వయంగా చెప్పుకొంటారు. కనుక కేంద్ర సహకారంతో ఐదేళ్ళలో ప్రజల అంచనాల మేరకు ఆయన అన్ని విధాల రాష్ట్రాభివృద్ధి చేసి చూపించినట్లయితే ఆ క్రెడిట్ పూర్తిగా ఆయనే క్లెయిం చేసుకొంటారు తప్ప దానిని బీజేపీతో పంచుకొంటారని అనుకోలేము. ఆ కారణంగా వచ్చే ఎన్నికల నాటికి ప్రజలలో ఆయన పాపులారిటీ ఇంకా పెరిగిపోతే, రాష్ట్రంలో తెదేపాకు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న బీజేపీ ఇక ఎప్పటికీ తెదేపాకు ‘తోక పార్టీ’ గా లేదా ‘ఆరవ వేలు’ గానే మిగిలిపోవలసి వస్తుంది.
ఈ ఐదేళ్ళలో రాష్ట్రం పూర్తిగా స్వయంసంవృద్ధి సాధించగలిగితే, అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇక కేంద్రంతో పనేమీ ఉండదు కనుక ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకొన్నా చేసుకోవచ్చును. అదే కనుక జరిగినట్లయితే చంద్రబాబు నాయుడుకి సహకరించి బీజేపీ తన కాళ్ళను తనే నరుకున్నట్లవుతుంది. బహుశః అందుకే కేంద్రప్రభుత్వం ఆయనకు పూర్తిగా సహకరించడం లేదని అనుమానించక తప్పడం లేదు.
అయితే దీనికి పరిష్కరం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు తన మైండ్ సెట్ మార్చుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఆయన పూర్తి క్రెడిట్ తనకే దక్కాలని ఆశపడకుండా దానిని రాష్ట్ర బీజేపీ నేతలతో, తన మంత్రులతో, అధికారులు, ఉద్యోగులతో చివరికి ప్రజలతో కూడా దానిని పంచుకోవడానికి సిద్దపడినట్లయితే, రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వైఖరిలో కూడా బహుశః మార్పు రావచ్చును. తెదేపాతో సమానంగా రాష్ట్రంలో బీజేపీని కూడా ఎదిగేందుకు ఆయన సహకరిస్తే, అప్పుడు కేంద్రం కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ఆయనకు అన్ని విధాల పూర్తి సహాయసహకారాలు అందించడానికి ముందుకు రావచ్చును. కానీ చంద్రబాబు నాయుడులో ఈ మార్పు ఆశించడం కష్టం కనుక కేంద్ర సహాయసహకారాలు కూడా ఆశించడం అత్యాసే అవుతుందని చెప్పవచ్చును.