మంచు విష్ణు చాలా రిస్క్ తీసుకుని చేసిన సినిమా `మోసగాళ్లు`. ఈ సినిమాకి నిర్మాత కూడా తనే. తన మార్కెట్ తెలిసి కూడా.. దానికంటే రెండింతలు ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశాడు. `నాకున్నదంతా ఊడ్చి మరీ సినిమా తీశా` అని విష్ణునే చెప్పుకున్నాడు. ఈ సినిమాకి 50 కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నా- కనీసం పాతిక కోట్లయినా అయ్యుంటుంది. అందులో 15 కోట్లు ఫైన్సాన్స్ తీసుకుని చేసిందే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా.. సినిమా విడుదలకు ముందే ఫైనాన్స్ క్లియర్ అయిపోతుంది. సినిమాని అమ్ముకుని, ఆ డబ్బులతో క్లియరెన్స్ తెచ్చుకుంటారు. కనీసం థియేటర్ల నుంచి వచ్చిన అడ్వాన్సులతో అయినా.. ఫైనాన్షియర్లకు కాస్త చెల్లిస్తారు. కానీ.. `మోసగాళ్లు` సినిమా ఎవరూ కొనలేదు. విష్ణునే సొంతంగా విడుదల చేశాడు. మోహన్ బాబు సొంత పూచీకత్తుపై.. ఈ సినిమా విడుదలైంది. చివరి క్షణాల్లో మోహన్ బాబు ముందుకొచ్చి, విష్ణుకి లైన్ క్లియర్ చేశాడని టాక్. ఇప్పుడు చూస్తే.. థియేటర్ల నుంచి అడ్వాన్సులు కూడా రాలేదు. సినిమా బాగుండి, కలక్షన్లు బాగా వస్తే… అప్పుడు ఆ డబ్బులు కడదాం అనుకుంటే, ఫ్లాప్ టాక్ వచ్చేసింది. వసూళ్లు కూడా బాగా డల్ గా ఉన్నాయి. ఇప్పుడు `మోసగాళ్లు`కు సంబంధించి ఫైనాన్షియర్లకు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత మోహన్‌బాబుపై పడింది. ఆయనకు 15 కోట్ల మొత్తం పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే ఈ సినిమాకి శాటిలైట్, ఓటీటీ రైట్ మార్కెట్ ఓపెన్ అయితే, ఎంతో కొంత రాబట్టొచ్చని విష్ణు భావిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన బేరసారాలు సాగుతున్నాయి. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమాని డబ్ చేశారు కాబట్టి.. ఓటీటీ, శాటిలైట్ బేరాలు వచ్చే అవకాశం ఉంది. అవైనా మోసగాళ్లని గట్టెక్కిస్తాయేమో చూడాలి.