తెలంగాణలో ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. డూ ఆర్ డై అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో వారి ప్రధాన అస్త్రం డబ్బే. ప్రచారం వరకే ఎంత ఖర్చు పెట్టారో ఊహించడం కష్టం. ఇప్పుడు ఎలక్షనీరింగ్ కు సిద్ధమయ్యారు. ఎలక్షనీరింగ్ అంటే ఇప్పుడు డబ్బులు పంచడమే. భారీ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఓటుకు నాలుగైదు వేల వరకూ పంచుతున్నారని వార్తలు వస్తున్నాయి. భారీ నిఘా పెట్టి ఎంత కట్టడి చేసినా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఎలాగోలా నగదు సమీకరించుకుని అధికార పార్టీకి తగ్గకుండా డబ్బులు పంచుతున్నారని చెబుతున్నారు.
పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ చాన్స్ నూ వదులుకోవడం లేదు. ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి సమస్య లేదు. ఐటీ, ఈడీ దాడుల భయమూ లేదు. ఇటీవల ఏకే గోయల్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి వందల కోట్లు బట్వాడా అయ్యయాన్న ప్రచారం జరిగింది. సోదాలు కూడా జరిగాయి. నిప్పు లేనిదే పొగ రాదని రాజకీయవర్గాలకూ తెలుసు. కానీ ఎక్కడా రూపాయి పట్టుబడలేదు. అదే సమయంలో కాంగ్రెస్ బడా వ్యాపారులు అయిన నేతలు ఎక్కడైనా నగదు తరలిస్తున్నారన్న విషయం తెలియగానే అధికారులకు తెలిసిపోతోంది. వెంటనే పట్టేసుకుంటున్నారు.
ఎలక్షనీరింగ్ విషయంలో కాంగ్రెస్ కష్టాలను ఎదుర్కొంటోంది కానీ తగ్గడం లేదు. తెలంగాణ చరిత్రలో ఇవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారుతాయని అంచనాలు ఊరకనే రావడం లేదు. ప్రతీ సారి అభ్యర్థుల అర్థిక బలాన్ని బట్టి ఖర్చులు ఉండేవి. ఈ సారి పార్టీ రాష్ట్ర నేతలు జోక్యం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్ రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ములుగు లాంటి చోట్లధన ప్రవాహం జరుగుతోంది. కాంగ్రెస్ ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే అవకాశం ఇచ్చింది. లేని వాళ్లకు పరోక్షంగా సాయం చేస్తున్నారు.
ఓడిన వాళ్లు కౌంటింగ్ సెంటర్లో.. గెలిచిన వాళ్లు ఇంటికివెళ్లి ఏడుస్తారనేది ఎన్నికలపై ఓ సామెత ఉంది. ఈ సారి కూడా అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్వం ఖర్చు పెట్టుకుని ఎన్నికల ఆట ఆడుతున్న వారే ఎక్కువ.