ఒక హిట్టూ, పది ఫ్లాపులూ ఇలా సాగుతోంది తెలుగు సినిమా. ఈ వారం అయితే బ్యాక్ టూ బ్యాక్ మూడు ఫ్లాపులు పడిపోయాయి. ఈ శుక్రవారం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకినీ డాకినీ, మీకు బాగా కావాల్సినవాడిని విడుదల అయ్యాయి. మూడింటి మీదా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మూడు సినిమాలకే ప్రమోషన్లు బాగానే చేశారు. కానీ మూడూ ఫ్లాపులే! తొలి రోజు, తొలి షోకే ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడం వల్ల… ఆయా సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజే.. ప్రేక్షకులు కరువయ్యారు.
ఇంద్రగంటిపై జనాలకు ఓ నమ్మకం. ఎలాంటి స్టార్ ఉన్నా మంచి సినిమా తీస్తాడులే అని. ‘వి’లో ఇద్దరు స్టార్లని పెట్టుకొన్నా తన మార్క్ చూపించలేకపోయాడు. మళ్లీ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో తన కిష్టమైన రొమాంటిక్ జోనర్లో సినిమా తీశాడు. కానీ ఈసారి కూడా మొండిచేయ్యే ఎదురైంది. కొరియన్ డ్రామా ‘ఓ బేబీ’తో హిట్టు కొట్టామని అక్కడి నుంచి మరో కొరియన్ కథని ఎత్తుకొచ్చింది సురేష్ ప్రొడక్షన్స్. మిడ్ నైట్ రన్నర్స్ని ‘శాకిని డానికి’ పేరుతో రీమేక్ చేశారు. రెజీనా, నివేదా.. ఇద్దరూ పేరున్న కథానాయికలే. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు కూడా. అయితే ఇది కూడా ఆశించిన ఫలితాన్ని తీసుకురాలేదు. ఇక… కిరణ్ అబ్బవరపు ఖాతాలో మరో ఫ్లాప్.. ‘నేను మీకు..’ రూపంలో పడిపోయింది. ‘సమ్మతమే’, ‘సబాస్టియన్’ ఇప్పుడు… ఇది. దాంతో యువ హీరో ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు జమయ్యాయి.
చిన్న, మీడియం రేంజు సినిమాలు హిట్టవ్వడం పరిశ్రమకు చాలా అవసరం. ఎందుకంటే… ఈ విజయాలే చిత్రసీమకు కావల్సినంత బూస్టింగ్ అందిస్తాయి. ఓ చిన్న సినిమా హిట్టయితే… కనీసం పాతిక సినిమాలు ఆ స్ఫూర్తితో కొబ్బరి కాయ కొట్టుకుంటాయి. అలాంటి చోట… మూడు మీడియం రేంజు సినిమాలు తొలి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం శోచనీయం.