తెలుగు360 రేటింగ్: 2.75/5
బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో `కథ`ని వెదికి పట్టుకోవడం చాలా కష్టం. చాలా చిన్న చిన్న పాయింట్లే కథలుగా వస్తుంటాయి. బొమ్మరిల్లు చూడండి. ఓ తండ్రికి కొడుకుపై ఉన్న అతి ప్రేమే కథైపోయింది. తండ్రి ప్రేమలోని గొప్పదనం నుంచి కూడా సంఘర్షణ సృష్టించేశాడు భాస్కర్. `అసలు అందులో సంఘర్షణే లేద`ని చాలామంది ఇప్పటికీ చెబుతుంటారు. కానీ మ్యాజిక్ జరిగిపోయింది. అప్పటి నుంచీ అదే మ్యాజిక్ కోసం…. ట్రిక్కులు ప్లే చేస్తూనే ఉన్నాడు భాస్కర్. `ఆరెంజ్`, `ఒంగోలు గిత్త`లలో ఆ ట్రిక్కులేవీ పని చేయలేదు. అందుకే తెలుగులో ఓ సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసేసుకున్నాడు. ఇంతకాలానికి `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తో మళ్లీ తనని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. వరుస ఫ్లాపుల తరవాత అఖిల్ తప్పకుండా హిట్ కొట్టాల్సిన సినిమా ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తోండడంతే కాస్త భరోసా కలిగింది. ఎన్నోసార్లు వాయిదా పడిన తరవాత… ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉంది? ఈ బ్యాచిలర్ కథేంటి?
హర్ష (అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. తనకి ఇండియాలో పెళ్లి సంబంధాలు వెదుకుతుంటారు. తనకు కాబోయే భార్య విషయంలో తనకు చాలా క్లారిటీ ఉందన్నది తన నమ్మకం. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక ఓ మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవడమే తరువాయి. అందుకే ఇండియా వస్తాడు. అయితే… విభ(పూజా హెగ్డే)ని కలుసుకున్న తరవాతే.. తనకు పెళ్లి విషయంలో క్లారిటీ లేదని, కన్ఫ్యూజన్ ఉందన్న విషయం అర్థం అవుతుంది. విభా.. ఓ ప్రత్యేకమైన అమ్మాయి. పెళ్లి విషయంలో తన దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. వాటికి… హర్ష దగ్గరే సరైన సమాధానాలు లేవు. మరి వాటిని అన్వేషించే ప్రయత్నం హర్ష చేశాడా? లేదా? వీరిద్దరూ కలుసుకున్నారా, లేదా? అనేది మిగిలిన కథ.
భాసర్క్ ఎప్పుడూ చిన్న లైనే పట్టుకుని, సినిమా తీసేయాలనుకుంటాడు. ఈసారీ అంతే. కథ కంటే కథనాన్ని ఎక్కువగా నమ్ముకున్నాడు. కానీ అందుకోసం పాత ఫార్మెట్ ని నమ్ముకోవడం ఆశ్చర్యపరుస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలోనూ, పత్రికల్లోనూ వచ్చిన జోకులన్నీ పేరుస్తూ… వాటిని యానిమేషన్ లో చూపిస్తూ, టైటిల్ కార్డు వేసేశాడు భాస్కర్. స్క్రీన్ ప్లే ఫార్మెట్ కూడా బొమ్మరిల్లుని గుర్తుకు తెస్తుంది. అక్కడ… సిద్దార్థ్ లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి తన కథ చెబుతాడు. ఇక్కడా ఇంచుమించు అలాంటిదే. హర్ష పాత్రని చాలా సింపుల్ గా ఇంట్రడ్యూస్ చేసేసిన భాస్కర్.. ఆ తరవాత పెళ్లి చూపుల ప్రహసనంతో కథలోకి వెళ్లాడు. ఒకటా రెండా? పది సీన్ల వరకూ పెళ్లి చూపులే. అమ్మాయిని చూడడం – అక్కడో ప్రశ్న వేయడం – రిజెక్ట్ కావడం, ఇదే తంతు. ఇదంతా ఇటీవల వచ్చిన షాదీ ముబాకర్ ఛాయల్లో వెళ్లిపోయింది. పెళ్లి చూపుల సీన్లు ముందు కాస్త సరదాగానే అనిపించినా, రాను రాను… `సినిమా అంతా ఇదేనా? కథైమైనా చెబుతారా` అంటూ ప్రేక్షకుడే ఇరిటేట్ అయ్యేలా చేశాయి.
పూజా ని స్టాండప్ కమిడియన్గా పరిచయం చేశారు. తన ఫొటో కోసం మురళీ శర్మ హీరోతో ఆడుకోవడం… లాజిక్ కి దూరంగా ఉంది. పెళ్లికి కావల్సిన అర్హతల మీద డిస్కర్షన్ పాయింట్ లా చాలా సీన్లు రాసుకున్నాడు దర్శకుడు. అందులో చాలా సమాచారం ఉంది. బేసిగ్గా… యువతరం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆ సీన్లు నడిచాయి. అయితే పాత్రలమధ్య కంటే.. తాను రాసుకున్న సీన్లలోనే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అసలు ప్రేమకీ, రొమాన్స్కీ తేడా ఏమిటి? ప్రేమలో రొమాన్స్ ఉండదా? రొమాన్స్ లో ప్రేమ ఉండదా? – ఈ చిన్న లాజిక్ ని దర్శకుడు వదిలేశాడు. ప్రేమ వేరు, రొమాన్స్ వేరు అని చెప్పే ప్రయత్నం చేశాడు. పాయింట్ లోనే కన్ఫ్యూజన్ చాలా ఉంది. దాన్ని తెరపై క్లారిటీగా చెప్పాల్సింది పోయి.. మరింత కన్ఫ్యూజ్ అయిపోయాడు. సెండాఫ్లో దాగుడు మూతల ప్రేమకథ బాగానే ఉన్నా, అసలు ఈ కథకు అదెంత అవసరం అనిపిస్తుంది? హర్ష – విభ నేరుగా కలుసుకుంటే కథకు వచ్చే అభ్యంతరం ఏమిటో తెలీదు.
క్లైమాక్స్ లో కూడా బొమ్మరిల్లు ఛాయలు కనిపిస్తాయి. ప్రధాన పాత్రలందరినీ ముందు పెట్టుకుని, వాళ్లలోని లోపాల్ని ఎత్తి చూపిస్తూ సాగే సీన్ అది. అంతకు ముందు…. స్టాండప్ కామెడీ కూడా… కన్నీరు పెట్టిస్తుంది వెరైటీగా.
అఖిల్ నటన బాగుంది. గత సినిమాలకంటే మెరుగయ్యాడు. అయితే తన గెటప్, ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఒక్కోసారి ఒక్కోలా ఉంది. కొన్ని సార్లు అమాయకుడిగా కనిపించే తన పాత్ర చిత్రణ.. కొన్ని సార్లు మోస్ట్ ఇంటిలిజెంట్ గా కనిపిస్తుంటుంది. అంటే.. హీరో క్యారెక్టరైజేషన్ రాసుకోవడంలోనూ భాస్కర్ కన్ఫ్యూజ్ అయ్యాడన్నమాట. హీరోయిన్ పాత్ర కూడా అంతే. తొలి సగంలో… అపర మేధావిలా కనిపిస్తుంది. ద్వితీయార్థంలో చిన్న చిన్న విషయాలకు హడలిపోతుంటుంది. పూజా గ్లామర్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. వెన్నెల కిషోర్ కి స్క్రీన్ లెంగ్త్ చాలా తక్కువ. అయినా తను కాస్త నవ్వించగలిగాడు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి.
టెక్నికల్ గా సినిమా బాగుంది. ముఖ్యంగా పాటలు. నేపథ్య సంగీతం. లొకేషన్లు కళకళలాడిపోయాయి. బాగానే ఖర్చు పెట్టారు. అయితే అమెరికా అని చెప్పి కొన్ని సీన్లు అన్నపూర్ణలో తీసేశారు. ఆ చీటింగ్ మామూలే అయినా, పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు చీటింగ్ గుర్తు పడితే, పంటికింద రాయిలా అనిపిస్తుంది. కొన్ని సంభాషణలు ఆకట్టుకుంటాయి. కాకపోతే.. ఎక్కువగా లెక్చర్లే వినిపిస్తాయి. భాస్కర్ కథనంపై ఆధారపడిపోయి తీసిన సినిమా ఇది. అయితే ప్రతీసారీ ఈ మ్యాజిక్ వర్కవుట్ కాదన్న విషయం బ్యాచిలర్ నిరూపిస్తుంది.
సింగిల్ లైన్ కథల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకే ఎమోషన్ ని మాటి మాటికీ చెప్పాల్సి వస్తుంది. దాంతో చూసిన సీన్లే చూసినట్టు అనిపిస్తుంది. ఈ కథలోనూ అదే జరిగింది. “నా పరిస్థితి అరిటాకులో రసంపోసినట్టు ఉంది. ఎటు పోతుందో తెలీదు. ఎలా ఆపాలో అర్థం కాదు` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. కథనం కూడా అలానే ఎక్కడో మొదలై, ఎక్కడెక్కడో తిరిగి, ఇంకెక్కడో ఆగినట్టు అనిపిస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.75/5