ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తేడాగా ఉన్నప్పటికీ… పరిస్థితులు సాఫీగా నడిచిపోతూండటానికి మందుబాబులు ఇతోధికంగా హెల్ప్ చేస్తున్నారు. రేట్లు ఎంత పెంచినా.. తాము రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినదాంట్లో ఠంచన్‌గా పన్ను కడుతున్నారు. అది కూడా కొంత మొత్తం కాదు. గత ఏడాది మందు బాబులు కట్టిన పన్నులు రూ. ఇరవై వైల కోట్ల వరకూ ఉంటాయి. పదకొండు నెలల్లోనే ఈ మొత్తం రూ. పద్దెనిమిది వేల కోట్ల వరకూ ఉంది. ఎలా లేదన్నా… ఆర్థిక సంవత్సరం మొత్తం మీద.. ప్రభుత్వ ఖజానాకు మందు బాబులు రూ. ఇరవై వేల కోట్లు జమ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాక ముందు ఈ మొత్తం కేవలం రూ. ఏడు వేల కోట్లు ఉండేది. ఇప్పుడిది మూడింతలు పెరిగింది.
మద్యం అలవాటును మాన్పించడానికి ధరలను షాక్ కొట్టిస్తామని ముందుగానే చెప్పిన సీఎం జగన్ ఆ మేరకు రేట్లు పెంచుకుటూ పోయారు. లాక్ డౌన్ తర్వాత రెండింతలు చేశారు. అయినా మందుబాబులు పాపం.. ప్రభుత్వం అనుకున్నారే కానీ ఎక్కడా తగ్గలేదు. ఎంత రేటు పెంచితే అంత పెట్టి కొనుగోలు చేసి… పన్నులు కడుతున్నారు. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి.. ప్రభుత్వం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ పోతోంది. కానీ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఈ షాపులో కాకపోతే.. మరో షాపులో కొనుక్కుంటామని.. అక్కడ రష్ ఉంటే క్యూలో నిలబడి అయినా టాక్స్ కడతామని… మందుబాబులు సిన్సియార్టీ చూపిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం గట్టెక్కుతోంది.
ప్రభుత్వానికి వచ్చే వివిధ రకాల ఆదాయం పడిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఆదాయం పడిపోయింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పది వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కానీ ఎక్సైజ్ ఆదాయం మాత్రం బాగా పెరిగింది. దీంతో చాలావరకు కవర్ అయింది. అందుకే మందు బాబుల పట్ల ప్రభుత్వం కూడా కాస్తంత కనికరం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాతబ్రాండ్లన్నింటికీ మళ్లీ అనుమతిఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి టెండర్లు ఖరేందుకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది.
వాస్తవానికి ఏపీలో ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రముఖ బ్రాండ్ల స్మగ్లింగ్ జరుగుతోంది. దీన్ని అరికట్టడం ఎస్ఈబీకి కూడా సాధ్యం కావడం లేదు. వీటన్నింటినీ అధిగమించి ప్రభుత్వానికి మరింత ఆదాయం సంపాదించుకునేలా చేయగలగాలంటే… ప్రముఖ బ్రాండ్లకుపర్మిషన్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో మద్య నిషేధం అనేది మాటలకే పరిమితం… ఆ పేరుతో ప్రజల్ని పిండుకోవడం మాత్రం… రెగ్యులర్ ప్రాసెస్‌గా మారిపోయింది.