మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం.
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితిని గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మోత్కుపల్లికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇంతవరకు ఆయన ఆరోగ్యం గురించి ఆసుపత్రి వర్గాలు ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. కానీ, మోత్కుపల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మోత్కుపల్లి విమర్శించారు. సోనియా , రాహుల్ గాంధీల అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ మోత్కుపల్లి వ్యాఖ్యలను పార్టీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికల్లో మాదిగలకు కనీసం రెండు సీట్లు అయిన ఇవ్వాలని డిమాండ్ తో శుక్రవారం ఆయన నివాసంలోనే దీక్ష చేపట్టడంతో బీపీ ,షుగర్ లెవల్స్ పడిపోయినట్లుగా తెలుస్తోంది.