బిజెపి నేత మోత్కుపల్లి నరసింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మాటలు బట్టి చూస్తే త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. అయితే ఆ తర్వాత బాబు తో విభేదించి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చారు. 2018 లో ఆలేరు నియోజకవర్గం నుంచి డీఎల్ఎఫ్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాలలో ఆయన బిజెపిలో చేరారు.
అయితే గత కొంత కాలంగా ఆయన కెసిఆర్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. కెసిఆర్ దళిత బంధు పథకం ఏర్పాటు చేసే ముందు వివిధ పార్టీల నాయకులతో సమావేశం అయినప్పుడు బిజెపి పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మోత్కుపల్లి ఆ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నుండి తమ పార్టీలో చేరితే ఆయన ఈటెల రాజేందర్ పై విమర్శలు చేశారు. ఇవన్నీ చూసిన వారికి ఆయన త్వరలోనే టిఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అని అప్పుడే అర్థమైపోయింది. అయితే ఇవాళ తాజాగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం కోసం కెసిఆర్ తన సూచనలు తీసుకున్నారని, తాను వీలైతే రైతుబంధు తరహాలో దళితుల కు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేలా చేయమని సూచించగా, అదేవిధంగా కెసిఆర్ చేశారని, కెసిఆర్ అభినవ అంబేద్కర్ గా మిగిలిపోతారని, దళిత బంధు పథకం అత్యద్భుతం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బిజెపిలో తీసుకునే ఏ నిర్ణయంలోనూ దళితుల భాగస్వామ్యం లేదని ఆ పార్టీని ఆయన విమర్శించారు.
అయితే ఇవన్నీ తాను వ్యక్తిగత రాజకీయాల కోసం మాట్లాడడం లేదని, దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి తాను మద్దతు మాత్రమే ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక టిఆర్ఎస్ పార్టీలో అధికారికంగా ఆయన చేరడం లాంఛనం మాత్రమే అని అనుకోవచ్చు.