టిటిడిపి ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తమ పార్టీని టిఆర్ఎస్లో విలీనం చేయడం మంచిదని హితబోధ చేయడం వెనక పెద్ద వ్యూహమే వుంది. తానొక్కడే పార్టీ మారితే ఫిరాయింపు ముద్ర పడుతుంది గనక మొత్తం పార్టీని గౌరవంగా విలీనం చేద్దామని మొదట చెబుతున్నారు. తన మాటలకు ఎవరు స్పందించి వచ్చినా గౌరవంగా ప్రవేశించవచ్చునని భావిస్తున్నారు. చాలాకాలంగా బిజెపి గవర్నర్ గిరీ ఇస్తుందని ఎదురు చూసి నిరాశ పడ్డాక ఆయన అడుగులు అటే పడుతున్నాయి.
పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఇదే ప్రతిపాదిస్తూ వచ్చారు. ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలన్నప్పుడు అందరికంటే ఎక్కువగా వాదించింది ఆయనే. అంటేకాంగ్రెస్లో గాక గులాబీ గూటిలోకి వెళ్లడం మంచిదని అప్పటినుంచే అనుకుంటున్నారు. తెలుగుదేశం అంతరించిపోతుందని అందరూ అనుకుంటున్నారని అనడం ద్వారా తనే ఆ మాట చెప్పేశారు. ఇందుకు ఎన్టీఆర్ ఘాట్‌ను వేదికగా చేసుకోవడం, తెలంగాణలో ఆయన పార్టీ స్థాపించారని చెప్పడం ఇవన్నిటిలోనూ రాజకీయం వుంది. ఎపి ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు సమయం కేటాయించడం లేదని చెప్పడమే గాక ఎన్టీఆర్ఘాట్ దగ్గరకు కొద్దిసేపు వచ్చి వెళ్తే బావుండేదని బహిరంగంగానే విమర్శ చేశారు. ఆయన ఇన్ని మాట్లాడినా టిటిడిపి అద్యక్షుడు రమణ మాత్రం వ్యక్తిగత స్వేచ్చ కింద తీసేయడం, ఆయన తమతోనే వుంటాడని చెప్పడం నిస్సహాయతనే సూచిస్తుంది. రేవంత్ రెడ్డి లాగే మోత్కుపల్లి కూడా మరో చోట భవిష్యత్తు వెతుక్కొవాలనుకుంటున్నారు. టిటిడిపికి పెద్ద అవకాశాలు వుండవని మాత్రం అందరూ అనుకుంటున్నారు. కాని ఓటర్లు కార్యకర్తలు భవనాలు వున్నందువల్ల తాము ఏం చేయాలో చంద్రబాబు దిశా నిర్దేశం చేయాలని సీనియర్ నేతలు చాలామంది మీడియాతో అంటూ వుంటారు. ఆ విషయంలో మోత్కుపల్లి మరో అడుగు ముందుకేశారంతే. ఇందుకు చంద్రబాబు ఆశీస్సులు వుంటాయని కూడా కొందరు చెబుతున్నారు. ఏమైనా అసలే ఉనికి కాపాడుకుంటున్న టిటిడిపికి ఇదో పెద్ద దెబ్బే. దీన్ని సాకుగా చూసి నిష్క్రమించే వారు బయిలు దేరతారు.