జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో విబేధించి.. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్న మోత్కుపల్లి… ఇప్పుడు ఏ పార్టీలోనూ చేరలేదు. మోత్కుపల్లిని ఆహ్వానించడానికి తెలంగాణలోని కాంగ్రెస్, టీఆర్ఎస్ సిద్ధంగా లేవని ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్లడానికి ఆయన సిద్ధంగా లేరు. అందుకే.. కొద్ది రోజుల క్రితం.. సొంతంగా ఓ పోరాట వేదిక పెడతానని… స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా పవన్ కల్యాణ్‌తో సమావేశం అవుతున్నారు. దీంతో జనసేన వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది.
పవన్ కల్యాణ్.. కేవలం ఏపీ వ్యవహారాలకే పరిమితమయ్యారు. అక్కడ మాత్రమే పోరాటయాత్రలు చేస్తున్నారు. కొంత మంది పార్టీ నేతలను చేర్చుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి నాయకులు లేరు. ఇలాంటి సమయంలో.. మోత్కుపల్లి నర్సింహులుని పార్టీలో చేర్చుకుని.. ఆయనకు తెలంగాణ విభాగం బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని.. కొంత మంది పవన్ కల్యాణ్‌కు సూచించినట్లు చెబుతున్నారు. జనసేన విధానాల ప్రకారమే… మోత్కపుల్లి నర్సింహాలు రాజకీయ ప్రకటనలు ఉంటున్నాయి. చంద్రబాబును అత్యంత తీవ్రంగా దూషించడంతో పాటు.. కేసీఆర్‌ను పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్‌తో సున్నం పట్టుకోవాలని అనుకోవడం లేదు. మోత్కుపల్లికి జనసేన బాధ్యతలు అప్పగిస్తే… తెలంగాణలో పార్టీ ఉనికి ఉంటుందన్న అంచనాలు జనసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి.
చంద్రబాబుపై విమర్శలు ప్రారంభించిన తర్వాత మోత్కుపల్లి నర్సింహులుతో ఏపీలో యాత్ర చేయించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు విజయసాయిరెడ్డి వెళ్లి… మోత్కుపల్లి మాట్లాడారు. యాత్ర ఖర్చు అంతా భరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎందుకో మరి అది కార్యరూపం దాల్చలేదు. మధ్యలో ఓ సారి తిరుమలకు వెళ్లారు కానీ.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ..విజయసాయిరెడ్డి వచ్చిన మాట్లాడారని అభిమానమో..మరో కారణమో కానీ.. ఏపీ విషయాలపై చంద్రబాబును తీవ్రంగా విమర్శించడానికి మోత్కుపల్లి తరచూ ప్రెస్మీట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్‌తో సమావేశం తర్వాత మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే పార్టీ కార్యక్రమాలను జనసేన అధినేత చక్క బెడుతున్నారు. కాలు బెణకడంతో పశ్చిగోదావరి జిల్లా పోరాటయాత్రను ఒక్క రోజుకే ముగించి హైదరాబాద్ చేరుకున్నారు.