తెలంగాణాలో తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేరు. ఆ విషయం మోత్కుపల్లి స్వయంగా గత మహానాడు సభలో బయటపెట్టారు. ఆ హామీ త్వరలో నెరవేరే సూచనలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అభ్యర్ధన మేరకు కేంద్రప్రభుత్వం మొత్కుపల్లిని దక్షినాది లేదా ఈశాన్య రాష్ట్రాలలో దేనికో ఒక దానికి కొత్త సంవత్సరంలో గవర్నర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెదేపా నేతలు చెపుతున్నారు. మళ్ళీ చాలా కాలం తరువాత ఈ అంశం తెర మీదకు వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు కనుక బహుశః ఈ వార్త నిజమేనని భావించవచ్చును. అదే నిజమయితే మోత్కుపల్లి దశ తిరిగినట్లే భావించవచ్చును.
తెలంగాణాలో తెదేపా పరిస్థితి ప్రతీ ఎన్నికలతో మరింత దిగజారుతోంది. ఈరోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తెదేపా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు, తెరాస నాలుగు స్థానాలు దక్కించుకొన్నాయి. త్వరలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒకవేళ వాటిలో కూడా తెదేపా తన సత్తా చాటుకోలేకపోయినట్లయితే, ఇక తెలంగాణాలో తెదేపా క్రమంగా తన ఉనికిని కోల్పోవడం తధ్యమనే చెప్పవచ్చును. ఈ నేపధ్యంలో మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి లభిస్తే, ఆయన పార్టీ పరిస్థితులతో సంబంధం లేకుండా హాయిగా కాలం వెళ్ళదీసేయవచ్చును. కానీ పార్టీలో మిగిలిన వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారవచ్చును.