వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మోత్కుపల్లి నర్సింహులుతో సమావేశమయ్యేందుకు ఆయన ఇంటికి వచ్చి… మీడియాను చూసి కారు దిగకుండానే వెళ్లిపోయారు. చంద్రబాబును తీవ్రంగా దూషించి ..మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి.. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును వ్యతిరేకించేవారు.. మోత్కుపల్లితో వరుసగా సమావేశం అవుతున్నారు. కొద్ది రోజుల కిందట.. ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో సహా వచ్చి మరీ… మోత్కుపల్లితో సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గవర్నర్ పదవి వస్తుందని ఆశించిన మోత్కుపల్లికి నిరాశే ఎదురయింది. రాజ్యసభ టిక్కెట్ ఇస్తారేమోనని చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు. ఇచ్చే అవకాశాలు కూడా లేపోవడంతో.. ఆయన రాజకీయ భవిష్యత్ కోసం.. వేరే పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
పార్టీ మారాలన్న వ్యూహంతోనే మహానాడు జరుగుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధినేతపై తీవ్ర విమర్శల చేశారన్న ప్రచారం ఉంది. కొద్ది రోజుల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు చేసిన సమయంలో .. ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. చంద్రబాబును వ్యతిరేకంగా అందర్నీ కూడగడతానన్నారు. ఈ యాత్రకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని… ముద్రగడ పద్మనాభం..మోత్కుపల్లికి గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా… మోత్కుపల్లి యాత్ర చేస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి.. చెప్పేందుకే.. ఆయనతో సమావేశమయ్యేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
మంచి వాగ్ధాటి ఉన్న మోత్కుపల్లి నర్సింహులు .. ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసి విమర్శలు చేస్తే … అది చంద్రబాబుకు ఇబ్బందికరమైన వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే యాత్ర ఖర్చులు పెట్టుకోవడం తోపాటు.. ఇతరత్రా సహాయ సహకారాలు అందిస్తామని మోత్కుపల్లికి విజయసాయరెడ్డి భరోసా ఇస్తారని చెబుతున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు.. టీడీపీ అధినేతకు సన్నిహిత నేతగా మెలికిన మోత్కుపల్లిని ఇప్పుడు చంద్రబాబునైనే ప్రయోగిచేందుకు విపక్షాలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు… మోత్కుపల్లితో భేటీ అయ్యేందుకు ప్రయత్నించడం ద్వారా.. విజయసాయిరెడ్డి నిరూపించారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మీడియా ఉందని.. విజయసాయిరెడ్డి కారు దిగకుండా వెళ్లిపోయినా…మాట్లాడుకోవడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి కాబట్టి… ఇద్దరి మధ్య డీల్ కుదిరిందనీ టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.