తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వెళ్లిన దగ్గర్నుంచీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. ఆయన ఆశించిన పదవులు రాలేదని, పార్టీని తప్పుబట్టడం మొదలుపెట్టి… టీడీపీకి ఆయన దూరమయ్యారు. అయితే, అక్కడితో ఆగకుండా.. ఏపీలో టీడీపీ ఓటమికి కృషి చేస్తానంటూ ఆయనో అజెండాతో ఆంధ్రాకి వస్తానంటున్నారు. వచ్చే నెల 11న తిరుమల వస్తాననీ, చంద్రబాబును ఓడించాలంటూ దేవుడిని మొక్కుకుంటానని మోత్కుపల్లి తాజాగా మరోసారి విమర్శించారు. దళితులకు చంద్రబాబు ద్రోహం చేశారనీ, ఇప్పుడు వారి ఓట్లను దండుకోవడం కోసమే దళిత తేజం అనే కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. మాల, మాదిగలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ముందుగా దళితులకు క్షమాపణలు చెప్పిన తరువాత ఆ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఇక, వైకాపా ఎమ్మెల్యే రోజా విషయానికొస్తే.. ఆమె కూడా దళిత తేజం కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అన్నారు. వారి ఓట్ల కోసం మరోసారి పాకులాడుతున్నారన్నారు. క్యాబినెట్ లో ఉన్న దళిత మహిళను తీసేశారనీ, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యలేదనీ, దళితుల పుట్టుకనే అవమానించారనీ, రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే స్పందించని ద్రోహి చంద్రబాబు అంటూ ఆమె విమర్శించారు. దళిత ఎమ్మార్వోను టీడీపీ వ్యక్తి కొడితే, పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేశారన్నారు. రాజధానిలో దళితుల భూములు లాక్కుని, వారికి కూలి కూడా అందనీయకుండా చేసిన ద్రోహి చంద్రబాబు నాయుడు అన్నారు.
రెండూ వేర్వేరు సందర్భాలు అయ్యుండొచ్చుగానీ… ఎమ్మెల్యే రోజా, మోత్కుపల్లి నర్సింహులు ఒకేలా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం కొంత ఆసక్తికరంగా ఉంది. మోత్కుపల్లి ఏపీ వస్తున్నారు కదా.. ఆ పర్యటనకు బ్యాక్ గ్రౌండ్ ఏర్పాట్లు వైకాపా చేస్తోందనే విమర్శలున్నాయి. పైగా, టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకి రావగానే… వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. దాంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజమే కదా. చంద్రబాబును విమర్శించేవారందరినీ ఆంధ్రాకు దిగుమతి చేసుకునే పనేదో వైకాపా నేతలు చేస్తున్నట్టు ఆ మధ్యనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం తనకు ఏదో అన్యాయం చేసేసిందని ఆంధ్రాలో చంద్రబాబును మోత్కుపల్లి విమర్శిస్తే.. ఆ ప్రభావం ఇక్కడి దళితులపై ఉంటుందనే వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఏదేమైనా, దళిత తేజం కార్యక్రమం విషయంలో మోత్కుపల్లి, రోజా ఒకే రకమైన వాణి బాణీ వినిపించడం విశేషం..!