ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు..! విచిత్రం ఏంటంటే… ఏపీ ప్రత్యేక హోదాపై తెలంగాణ నేతలెవ్వరూ పెద్దగా స్పందించలేదుగానీ, మోత్కుపల్లి మాత్రం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడటం! అదేదో ఏపీ ప్రజల ప్రయోజనాలకు మద్దతుగా మాట్లాడాలన్నది ఆయన ఉద్దేశం కాదనేది అందరికీ తెలిసిందే. కేవలం చంద్రబాబును విమర్శించడం కోసం మాత్రమే పెట్టుకున్న కార్యక్రమం ఇది. వైకాపా ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నారని పార్లమెంటులో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని భాజపా సర్కారు తప్పు తనకేమీ కనిపించడం లేదని మెత్కుపల్లి విశ్లేషించారు..! ప్రత్యేక ప్యాకేజీ చాలు అని సీఎం చెప్పాకనే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందన్నారు. అయితే, హోదా విషయమై జగన్, పవన్ లు మాట్లాడేసరికి… ఓట్లు పోతాయేమో అనే భయంతో యూ టర్న్ తీసుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఏపీకి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆయన్ని తప్పించాలన్నారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు మోత్కుపల్లి పిలుపునిచ్చారు. తాను దేవుడిని ఒకటే కోరుతున్నాననీ.. ఈ దుర్మార్గుడిని ఓడించడమే తన కోరిక అన్నారు! తిరుపతిలో తాను మొక్కుకున్న ఈ మొక్కు వృథాగా పోదని ధీమా వ్యక్తం చేశారు.
మోత్కుపల్లి మాటలు చూస్తుంటే… ఈయన తెలంగాణ నేతా, లేదా ఏపీకి చెందిన ఏదైనా పార్టీ నాయకుడా అనే అనుమానం రోజురోజుకీ పెరుగుతోంది. ఆంధ్రా రాజకీయాలతో ఆయనకేంటి సంబంధం..? మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదాతో ఈయనకున్న కనెక్షన్ ఏంటో అర్థం కావడం లేదు..? టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారన్న అక్కసుతో ఆ పార్టీపై విమర్శలకు దిగారు. ఆయన తెలంగాణలో బహిష్కృత నేత అయితే… ఆంధ్రాకి వచ్చి విమర్శలు చేయడం వల్ల ఏం ఉపయోగం..? ఆయన తీరు చేస్తుంటే… రేపోమాపో ఏపీకి చెందిన ఏదో ఒక పార్టీలో చేరిపోతారా అనేంత స్థాయిలో ఉన్నాయి..!
అయితే, ఈ క్రమంలో తెలంగాణలో ఆయన పొలిటికల్ కెరీర్ ను పూర్తిగా వదులుకుంటున్నారని విశ్లేషించుకుంటున్నట్టు లేదు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీ ఏమంత బలంగా లేదు. ఉన్ననేతలే ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. అలా ఇతర పార్టీలో చేరే ప్రయత్నాలేవీ చేసుకోకుండా… ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం వల్ల ఆయనకి ఎలాంటి ఉపయోగమూ లేదు.