మోత్కుపల్లి నర్సింహులు గత ఎన్నికల్లో జగన్ రెడ్డి కోసం చంద్రబాబుపై ఎన్ని బండలు వేయాలో అన్నీ వేశారు. తిరుమలకు వెళ్లి మరీ చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నానన్నారు. ఆ తర్వాత చంద్రబాబును బూతులు తిడుతూ..జగన్ ను గెలిపించాలన్నారు. తన దళిత కార్డును జగన్ రెడ్డి కోసం గట్టిగా వాడారు. అయితే ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేయించినందుకు ఆయన ఆలస్యంగా బయటకు వచ్చి జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించి జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
జగన్ రాక్షాసానందం పొందుతున్నారని.. మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో ఇదే ఘాట్ నుంచి నేను మాట్లాడుతూ జగన్ గెలవాలని ప్రచారం చేశానన్నారు. తన పిలుపుతో దళిత వర్గాలు, పేద వర్గాలన్నీ ఏకమై జగన్ ను గెలిపించాయన్నారు. అధికారంలోకి వచ్చిన తెల్లారే జగన్ మైకంలోకి వెళ్లాడు. ఆ మైకం ఎంత వరకు వెళ్లిందంటే… తల్లిని ఇంటి నుంచి బయటకు పంపించాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వేల కిలోమీటర్లు నడిచిన చెల్లెలు షర్మిలను మెడబట్టి బయటకు గెంటాడు.
ఆయన పాలన ఎలా ఉందంటే… రాజధాని లేని రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. జగన్ పాలించే రాష్ట్రంలో రాజధానే లేదు. 151 సీట్లు ప్రజలిస్తే అది అహంకారంలోకి వెళ్లింది. ఒక్క ఛాన్స్ ఇస్తే బాగా పాలిస్తాడని ప్రజలు నమ్మారు. కానీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ పాలిస్తున్నాడు. మాట్లాడిన వాడినల్లా కొట్టి, తిట్టి, భయపెట్టి నియంత మాదిరి జగన్ రాజ్యమేలుతున్నాడని మోత్కుపల్లి మండిపడ్డారు. 74 సంవత్సరాల పెద్దమనిషి, ఈ దేశానికే నాయకుడు, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నావా? నువ్వొక దుర్మార్గుడివి అని మండిపడ్డారు.
2021లో కేసు బుక్ అయింది. కేసులో ఉన్న వారంతా బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబును ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఏమిటి? చంద్రబాబు వంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. వ్యక్తులే లేకుండా చేయాలనుకుంటున్నావా అని మండిపడ్డారు. తెలంగాణ నుంచి గతంలో చంద్రబాబును తిట్టిన వాళ్లంతా.. అరెస్టుపై జగన్ రెడ్డిని తప్పు పడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులేనంటున్నారు.