తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఉన్న పళంగా దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఆ పథకానికి చైర్మన్గామోత్కుపల్లి నర్సింహులు పేరును దాదాపుగా ఖరారు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరలేదు. ఇటీవలే భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ గతంలో ఏర్పాటు చేసిన దళిత సాధికారిత సమావేశంలో బీజేపీ పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. అయితే మోత్కుపల్లి మాత్రం బీజేపీ నేతగా హాజరయ్యారు. అప్పట్నుంచి ఆయన కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీడీపీ నుంచి వెళ్లిపోయి చంద్రబాబును నానా తిట్లు తిట్టిన మోత్కుపల్లిని ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేర్చుకోలేదు. చివరికి కిషన్ రెడ్డి సాయంతో బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు కేసీఆర్ .. హుజూరాబాద్ సమీకరణాల కోసం మోత్కుపల్లిని దగ్గరకి తీయాలని నిర్ణయించడంతో మోత్కుపల్లి ఆయనకు దగ్గరైపోయి బీజేపీని విమర్శించడం ప్రారంభించారు. ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు చైర్మన్‌గా పేరు ఖరారు చేయబోతున్నారని తెలియడంతో ఆయన సంతోషంఓ రేంజ్లో ఉంటోంది. అధికారికంగా టీఆర్ఎస్లో ఇంకా మోత్కుపల్లి చేరలేదు. సందర్భాన్ని బట్టి చేర్చుకోవాలని చూస్తున్నారు. దళిత వర్గాల ఓటు బ్యాంక్‌పై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అందులోనూ మాదిగ వర్గానికి ప్రత్యేకంగా తాయిలాలు ఇస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరికి త్వరలో మంత్రిపదవులు ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ సీఎం కూడా ఇస్తారు. కేసీఆర్ ప్రస్తుత సమీకరణాలన్నీ కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదని వచ్చే సాధారణ ఎన్నికల కోసమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అధికార వ్యతిరేకతను అధిగమించేలా దళిత ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ కోణంలోనే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.