తెలంగాణ టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు షో..నేడు, రేపు తిరుమల, తిరుపతిల్లో జరగనుంది. మంగళవారం సాయంత్రమే ఆయన తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుని… టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలి విడత తిట్లు, శాపనార్థాలు పెట్టేశారు. దానికి జగన్ మీడియా కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చింది. ఇక అలిపిరి నుంచి కొండపైకి నడిచి వెళ్తారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడి… మళ్లీ చంద్రబాబునే చెడామడా తిడతారు. అందులో నో డౌట్. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆయనను రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని రేణిగుంట ఎయిర్‌పోర్టులోనే చెప్పారు. మళ్లీ 12వ తేది మధ్యాహ్నం తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి మరోసారి చంద్రబాబును విమర్శిస్తారట. ఇదీ ఆయన రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిల్లో షెడ్యూల్.
తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న ఒక్క మాటతో.. మోత్కుపల్లి టీడీపీకి దూరమైపోయారు. టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. మధ్యలో తాను అన్న మాటల్ని వెనక్కి తీసుకుని..”చంద్రబాబే నాకు అన్నీ” అనిచెప్పుకున్నా… సానుకూలత రాలేదు. మహానాడుకు కూడా ఆహ్వానం పంపలేదు. దాంతో ఎన్టీఆర్ జయంతి రోజే.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కన్నీళ్లు పెట్టుకుని.. చంద్రబాబును వ్యక్తిగతంగా తిట్టడం ప్రారంభించారు. అయితే తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనను పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు వచ్చిపడింది.
చంద్రబాబు అంటే తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న ముద్రగడ పద్మనాభం… మోత్కుపల్లి నర్సింహులు.. బ్లాస్ట్ అయిన రెండో రోజే వెళ్లి మంతనాలు జరిపి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఓ సారి దొంగచాటుగా వెళ్లి కలుద్దామని ప్రయత్నించి మీడియా ఉండటంతో వెనక్కి వెళ్లిపోయారు. మరోసారి నేరుగానే వచ్చి చర్చలు జరిపారు. ఏపీలో యాత్ర చేసి.. చంద్రబాబును చెడామడా తిట్టేస్తే..యాత్రకు కావాల్సిన ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దానికి మోత్కుపల్లి కూడా అంగీకరించారు. ఆ విషయాన్నే ఆయనే చెప్పారు కూడా. అది తిరుమల నుంచి ప్రారంభమవుతోందని అనుకోవచ్చు.
అయినా ఫ్రస్ట్రేషన్ రాజకీయాల్లో మోత్కుపల్లి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు..! ఎందుకంటే.. శ్రీవారి దగ్గరకు వెళ్లేటప్పుడు.. ఎవరైనా నిర్మలమైన మనసుతో వెళ్తారు. కుళ్లు, కుతంత్రాలను వదిలేసి… తమకు మంచి చేయాలనో.. కుటుంబానికి మంచి చేయాలో…సమాజానికి మంచి చేయాలనో వేడుకోవడానికి వెళ్తారు. కానీ మోత్కుపల్లి మాత్రం… చంద్రబాబుకు చెడు చేయాలని కోరుకోవడానికి వెళ్తున్నానని బహిరంగంగా చెబుతున్నారు. బహుశా శ్రీవారికి ఇలాంటి భక్తుడు…మోత్కుపల్లి ఒక్కరే ఉంటారేమో..?