టీ టీడీపీ బహిష్కృత నేతకు మోత్కుపల్లి నర్సింహులుతో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. నిజానికి, రెండ్రోజుల కిందటే మోత్కుపల్లి ఇంటివైపు విజయసాయి వచ్చారు. కానీ, అప్పటికే మీడియా అక్కడికి చేరుకోవడం వెనక్కి వెళ్లిపోయారు. గురువారం నాడు మోత్కుపల్లిని విజయసాయి రెడ్డి కలిశారు. తిరుపతికి వచ్చి, యాత్ర చేస్తానని ఇప్పటికే మోత్కుపల్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు విజయసాయి రెడ్డి కలిశారట! టీడీపీ నుంచి బహిష్కృతమైన దగ్గర నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మోత్కుపల్లి ఆరోపణలూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ.. మోత్కుపల్లి యాత్రకు వైకాపా ఎందుకు మద్దతు ఇస్తోందీ..? ఈ ప్రశ్నకు ఒక్కటే జవాబు.. చంద్రబాబును ఎవరు విమర్శిస్తే వారికి వైకాపా మద్దతు ఇస్తుంది, అంతే! నిజానికి, ఆంధ్రా రాజకీయాలతో మోత్కుపల్లికి ఏంటి సంబంధం..? తెలంగాణను వదిలి, వైకాపా తరఫున ఇక్కడెక్కడైనా పోటీ చేస్తారా..? లేదంటే, తెలంగాణలో వైకాపా నేతగా ఇకపై చెలామణి అవుతారా..? ఎలా చూసుకున్నా ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏపీ యాత్ర ఏమాత్రమూ ఉపకరించదు. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నట్టు..? కేవలం చంద్రబాబును విమర్శించేందుకు మాత్రమే. అంటే, వైకాపాకి మరో అద్దె మైకు మోత్కుపల్లి రూపంలో దొరికిందని చెప్పుకోవాలి.
ఇక, వైకాపా విషయానికొస్తే… ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ ను ఎలాగో ఒకలా దెబ్బ తీయాలన్న ఉద్దేశమే మోత్కుపల్లికి మద్దతు ఇవ్వడం వెనక కనిపిస్తోంది. మోత్కుపల్లి దళిత నేత అనీ, చంద్రబాబు దళిత వ్యతిరేక బుద్ధి బయటపడిందని ఈ సందర్భంగా విజయసాయి అన్నారు. సో.. ఈ ఒక్క ముక్కా పట్టుకుని సీఎంపై విమర్శలు చేయిస్తారన్నమాట. తెలంగాణా మాజీ టీడీపీ నేతను తీసుకొచ్చి… ఏపీలో సీఎంపై విమర్శలు చేయిస్తే, ప్రజల్లో ప్రభావం ఉంటుందని వైకాపా ఎలా అంచనా వేస్తోందో వారికే తెలియాలి..! పోనీ, మోత్కుపల్లికి ఏపీ రాజకీయాలు తెలుసా..? ప్రస్తుతం ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై వార్తల్లో చూసిన కథనాలే తప్ప, వాస్తవాలు అర్థం చేసుకునే అనుభవం ఉందా..? కేవలం చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు మాత్రమే చేయగలరు, అంతే. పొద్దెక్కింది మొదలు పొద్దుగూకే వరకూ జగన్ అండ్ కో చేస్తున్న పని అదే కదా! అలాంటప్పుడు, మోత్కుపల్లి మాటలకు కొత్తగా ఆకర్షితులయ్యేవారు ఎవరుంటారు..? ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా వైకాపా తన దిగజారుడు రాజకీయ బుద్ధిని బయటపెట్టుకోవడం తప్ప, ఏరకంగానూ ఉపయోగం ఉండదు.
మోత్కుపల్లి, విజయసాయి రెడ్డి భేటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. నిఘా వర్గాల ద్వారా ఈ విషయం సీఎంకి తెలిసింది. ఈ సమావేశం గురించి ఆయన ముందు ప్రస్థావన రాగానే ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు.