దాదాపు రెండు గంటల పైగా సాగిన టిటీడీపి సమావేశం హాట్ హాట్ చర్చలకు దారితీసినట్టు సమాచారం. అనుకోని విధంగా రేవంత్‌రెడ్డి హాజరవడంతో చర్చ మొత్తం రేవంత్‌కు అనుకూల, వ్యతిరేక వాదనలకు కేంద్రంగా మారిపోయింది. ఒక దశలో వాగ్వవాదం ముదిరిందని సమాచారం.
అసలు రాహుల్‌తో రేవంత్ కలవాల్సిన అవసరం ఏమిటి? అంటూ టీటీడీపీలో ప్రస్తుతం సీనియర్ నాయకుల్లో ఒకరైన మోత్కుపల్లి నర్సింహులు ఒకింత గట్టిగానే నిలదీశారనీ… దీనికి తాను ఎవరికి సమాధానం చెప్పాలో వారికే చెబుతానని రేవంత్ బదులిచ్చాడనీ తెలిసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై ఏమి మాట్టాడాల్సి వచ్చినా నేరుగా చంద్రబాబుతోనే మాట్టాడతాను తప్ప మీకెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ అనడంతో కొందరు తెలుగుదేశం నాయకులు ఆగ్రహానికి గురైనట్టు అంటున్నారు. అలా అయితే ఈ చర్చఅర్ధమే లేదంటూ మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ అర్ధంతరంగా సమావేశం నంచి వెళ్లిపోయారని కూడా తెలిసింది.
సమావేశం అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి… సమావేశం సజావుగా సాగిందన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించామని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల గురించి ఈ నెల 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు.