తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు అనగానే.. అందరూ రేవంత్ రెడ్డి వైపు చూసేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ఇమేజ్ ఇప్పుడు మసకబారిపోయింది. ఆయన స్థానంలో పెద్దరికం తీసుకునేందుకు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు దాదాపు సిద్ధపడిపోయారు. నిజం చెప్పాలంటే, ఆయన లక్ష్యం కూడా ఇదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రేవంత్ రెడ్డి తనకంటే జూనియర్ కాబట్టి, ఆయన అండర్ లో పనిచేయడం మోత్కుపల్లికి అస్సలు ఇష్టం లేదు! అందుకే, రేవంత్ ని బయటకి లాగారని చెప్పొచ్చు. గవర్నర్ పదవి రాలేదు, రాజ్యసభ సీటు వస్తుందో రాదో అనుమానం. కాబట్టి, టీ టీడీపీలో మళ్లీ ప్రాధాన్యత పెంచుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు అవసరం. ఈ క్రమంలో చాలావరకూ మోత్కుపల్లి విజయం సాధించారనే చెప్పాలి. అయితే, పెంచుకున్న ప్రాధాన్యతతోపాటు భవిష్యత్తులో పార్టీపరంగా ఎదురు కాబోతున్న పరిణామాలకు కూడా ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా!
తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం మోత్కుపల్లి ఇష్టం లేదు. రేవంత్ ప్రతిపాదనే అది! అలాంటప్పుడు ఒంటరి పోరాటం చెయ్యొచ్చు. కానీ, కేసీఆర్ తో పొత్తు కోసం ఇప్పుడు మోత్కుపల్లి వెంపర్లాడుతున్నారు. ఒక్కసారి గతంలోకి వెళ్తే… ఉద్యమ సమయంలో కేసీఆర్ మీద తీవ్రంగా విరుచుకుపడింది ఈ మోత్కుపల్లే! ఓరకంగా, తెలంగాణకు తెలుగుదేశం వ్యతిరేకం అనే ఇమేజ్ రావడానికి ఈయనా ఓ ప్రధాన కారణం. కేసీఆర్ అంటే చాలు, ఒంటికాలిపై లేచిపోతూ ఉండేవారు. అలాంటిది, ఇప్పుడు కేసీఆర్ దోస్తీకి సిద్ధం అని చెబుతున్నారు. తెరాసతో దోస్తానా ఎందుకయ్యా అంటే.. కాంగ్రెస్ కు తాము బద్ధ వ్యతిరేకులం అని మోత్కుపల్లి అంటున్నారు. కానీ, గతంలో ఆయన కాంగ్రెస్ లో కూడా పనిచేశారే! అంత వ్యతిరేకత మోత్కుపల్లికి ఎప్పుడొచ్చేసింది..? ఓసారి ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచారు. ఈ ట్రాక్ రికార్డ్ ఉంచుకుని, తాము మొదట్నుంచీ కాంగ్రెస్ కు వ్యతిరేకులం అనే వాదన ఈయన వినిపించడం సమంజసంగా ఉందా..?
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుంచీ రాగానే రేవంత్ రెడ్డి అంశానికి ఏదో ఒక ముగింపు వస్తుంది. కానీ, ఆ తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మోత్కుపల్లే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ పార్టీ తరఫున పెద్దన్న పాత్రను మోత్కుపల్లి పోషిస్తే… ఆయన్ని ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? కాస్తోకూస్తో ఉన్న టీడీపీ కేడర్ నమ్ముతుందా..? ఆయన వెనక వస్తుందా..? హఠాత్తుగా గుర్తొచ్చేసిన ఈ నిబద్ధతను విశ్వసించేంది ఎంతమంది..? కేసీఆర్ పక్కనచేరితే.. ఉద్యమ సమయంలో ఆయన్ని దూషించిన చరిత్ర ప్రజలకు గుర్తుకొస్తుంది. లేదూ.. కాంగ్రెస్ కు వ్యతిరేకం కాబట్టే చేరామని చెప్పుకున్నా, ఆ పార్టీలో ఆయన ప్రస్థానాన్ని ప్రజలు మరచిపోలేదు కదా! ఏతావాతా తెలంగాణాలో కొన ఊపరితో ఉన్న తెలుగుదేశం పార్టీకి మొత్తంగా గండిపడే అవకాశం కనిపిస్తోంది. లేదూ… ఎదురుకాబోతున్న పరిణామాలన్నింటికీ తట్టుకుని, పార్టీ ఉనికిని కాపాడతానూ అనే బాధ్యతను మోత్కుపల్లి పరిపూర్ణంగా తీసుకునే పరిస్థితి ఉందా..? రేవంత్ ను విమర్శించినంత ఈజీగా పార్టీని నిలబెట్టడం ఆయనకు సాధ్యమౌతుందా..? తెలంగాణలో టీడీపీకి ఎదురుకాబోతున్న పరిణామాలకు ఆయన బాధ్యత వహిస్తారా..?