దళిత బంధు పథకంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా సొంత పార్టీ నేతలు బలంగా తిప్పికొట్టలేకపోతున్నారన్న అసంతృప్తిలో ఉన్న కేసీఆర్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఇంకా టీఆర్ఎస్లో చేరని మోత్కుపల్లి నర్సింహాలు రంగంలోకి దిగారు. హఠాత్తుగా ఆయన దీక్ష చేపట్టారు. ఆ దీక్ష ఎందుకంటే రేవంత్ రెడ్డి దళిత బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేయరని చేస్తున్న ప్రకటనలకు నిరసనగానట. ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన ఆయన ఓ భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వంద శాతం దళిత బంధు పథకం అమలు చేయకపోతే తాను యాదగిరి గుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. ఆయన ప్రకటనపై టీఆర్ఎస్ వర్గాలు కూడా నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది.
మోత్కుపల్లి నర్సింహులు రాజకీయంలో తిట్టని రాజకీయ నేత లేరు. నాడు ఎన్టీఆర్‌నూ తిట్టారు. తర్వాత వైఎస్, చంద్రబాబునూ వదల్లేదు. చివరికి కేసీఆర్‌నూ వదల్లేదు. ఆయనపై చేసిన ఘాటు వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడూ తిరుగుతూంటాయి. కానీ ఇప్పుడు రాజకీయ భవిష్యత్ కోసం టీఆర్ఎస్ అధినేతను ఆయన పొగడక తప్పడం లేదు. గతంలో తిట్టేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పొగిడితే నమ్మరేమో అనుకుని అప్పటి తిట్లకు ఇప్పుడు సారీ కూడా చెప్పేస్తున్నారు. కేసీఆర్‌ను ఆకాశానికెత్తేస్తున్నార.ు
అయితే మోత్కుపల్లి పాట్లన్నీ రెంటికి చెడ్డ రేవడి కాకుండా ఉండటానికేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దళిత బంధు పథకానికి చట్టబద్ధత ఇచ్చి చైర్మన్ చేస్తారని మోత్కుపల్లి ఆశలు పెట్టుకున్నారు. అందుకే సైలెంట్‌గా ఉండకుండా కేసీఆర్ ను సందర్భం వచ్చినప్పుడల్లా పొగుతుతున్నారని అంటున్నారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక ముగిసేవరకూ కేసీఆర్ తన లక్ష్యం ప్రకారం ఉంటారని.. తర్వాత ఎవర్ని పట్టించుకారో లేదో తెలియదని రాజకీయపార్టీలు భావిస్తున్నాయి. అందుకే మోత్కుపల్లి కేసీఆర్‌ను ఇంప్రెస్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.