ఆదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు రాతకోతలన్నీ పూర్తయిపోయాయి. ఆదానీ గ్రూప్ సంస్థల అదినేత గౌతమ్ ఆదాని ప్రత్యేకంగా అమరావతి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో.. ఒప్పందం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి- అదాని గ్రూప్‌కు మధ్య ఎంవోయూ కుదిరింది. డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్క్‌ల అభివృద్ధికి ఒప్పందం జరిగింది. ప్రపంచంలోనే మొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్‌ను… విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది అదాని గ్రూప్. మూడు ప్రాంతాల్లో 500 ఎకరాల్లో.. 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఏపీలో రూ.70వేల కోట్ల పెట్టుబడి అదాని గ్రూప్ పెట్టనుంది.
భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలు డేటా ద్వారానే ఉంటాయన్నారు. యువత భవిష్యత్తు అంతా డేటా ద్వారానే ఉంటునిద.. డేటా ద్వారానే వినూత్న ఆవిష్కరణలు ఉంటాయని జోస్యం చెప్పారు. వైజ్ఞానిక ఆర్ధిక వ్యవస్థదే భవిష్యత్తన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీయే ముఖ్యమని ..ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా సెంటర్ కీలకమన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశామని.. ఇప్పుడు ఏపీని డేటా హబ్ చేస్తున్నామని ప్రకటించారు.
గౌతమ్ ఆదానికి.. గుజరాత్ కు చెందిన బడా పారిశ్రామిక వేత్త. అయితే ఈయన నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితునిగా పేరు ఉంది. గత ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ఎన్నికల ఖర్చును ఆయనే పెట్టుకుని.. అదానీ సంస్థకు చెందిన జెట్ నే.. ఆయన ఉపయోగించారని చెబుతూ ఉంటారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలోనే.. గౌతమ్ అదానీ.. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తగా ఎదిగారని చెబుతూంటారు. మోదీ, అమిత్ షాల ప్రాపకం వల్లే ఆయనకు బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు అందుతూంటాయని చెబుతూంటారు. అలాంటిది.. ఇప్పుడు… మోదీ – చంద్రబాబు మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితులు ఉన్న నేపధ్యంలో అంబానీ… ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆశ్చర్యం కలిగించే అంశమే.