సినిమా ఇండస్ట్రీకి ఏపీ స్వాగతం పలుకుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. అంతకు ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ ఏపీకి వెళ్లిపోవాలని సలహాలివ్వడం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ మొదట్లో అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇంత కంటే ఘోరమైన పరిణామాలు ఉండేవి. ఉద్యమ సమయంలో హీరోలను ఎలా టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఒక్క ఇంచ్ కదల్లేదు. ఇప్పుడో హీరోకు సమస్య వచ్చిందని అంతా కదిలిపోయే చాన్స్ లేదు.
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో పాతుకుపోయిది . ఇదేమి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ కాదు. ల్యాప్ ట్యాప్ చంకనపెట్టేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోతే ..ఆఫీసును తరలించేశాం అని చెప్పుకోవడానికి. ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందాయి. ఇండస్ట్రీ అంటే ఒక్క షూటింగ్ కాదు. ఆ షూటింగ్ కథకు అవసరంగా ఎక్కడైనా జరుగుతుంది. ఏపీలో జరుగుతుంది.. అమెరికాలో కూడా జరుగుతుంది. అదే ఇండస్ట్రీ అనుకునేవారితోనే సమస్య వస్తుంది. ఇండస్ట్రీ ఒకరికి వచ్చిన సమస్యతో మారిపోయేందుకు ప్రయత్నించదు.
ఇంకెక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ది చెందవచ్చు కానీ ఇక్కడి నుంచి పోయి అక్కడ స్థిరపడుతుందని ఎవరూ అనుకోలేరు. ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాల్సి ఉంది. అది ప్రభుత్వం చేతుల్లో లేదు. అవకాశాల్ని బట్టి డెవలప్ కావాలి. అయినా అక్కడ మాత్రం రాజకీయాలు ఉండవా ?. రాక్షస రాజకీయ నేతలు ఉండరా ? రామానాయుడు స్టూడియోస్ అక్కడి రాజకీయాల నేతలు కబ్జా చేయబోయారు. అక్కడికి వెళ్లి ఇండస్ట్రీ ఎలా తట్టుకుంటుంది ?.