డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ని ఉక్కిరి బిక్కిరి చేసింది. కొంతమంది పేర్లు బయటకు వచ్చేసరికి – మొత్తం చిత్రసీమనే దోషిగా చూస్తోంది లోకం. డ్రగ్స్ తీసుకొంటుందెవరో, ఎవరు సప్లై చేస్తున్నారో ఇంకా తేటతెల్లంగా తెలియకపోయినా – చిత్రసీమ మొత్తం డ్రగ్స్ వలయంలో కొట్టుమిట్టాడుతున్నట్టు ప్రచారం మాత్రం భారీగా జరిగింది. మీడియా కూడా… ఇంకేం పని పెట్టుకోకుండా కేవలం డ్రగ్స్‌పైనే ఫోకస్ పెట్టింది. ఈ తతంగం అంతా చిత్రసీమకు మింగుడు పడడం లేదు. ఏ కొద్ది మందో తప్పు చేస్తే సినిమా పరిశ్రమ మొత్తాన్ని దోషిగా చూడాల్సిన అవసరం లేదన్నది వాళ్లమాట. అదీ నిజమే! చిత్రసీమంటే ఒకరిద్దరుకాదుగా. వందలమంది. ఓ సమూహం. ఓ పరిశ్రమ. అలాంటప్పుడు.. 12 మందికి నోటీసులు వచ్చినంత మాత్రాన… టాలీవుడ్ మొత్తం మత్తులో జోగుతోంది అనుకోవడం తప్పే. పైగా ఆ 12 మందిపై నేరాలేం రుజువు కాలేదు. కాకపోతే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటి వరకూ `హీరో`ని చూసినట్టు చూసిన ఫిల్మ్ ఇండ్రస్ట్రీని ఇప్పుడు విలన్ గా మారిపోయింది. అందుకే… సినిమా పరిశ్రమ మనసు నొచ్చుకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖరాసింది చిత్రసీమ. నిర్మాతల మండలి, మా, ఫిల్మ్ ఛాంబర్… ఇలా చిత్రసీమలో ప్రముఖమైన సంస్థల తరపున ఓ లేఖ రాసి, ముఖ్యమంత్రికి చేరవేసింది.
డ్రగ్స్ వ్యవహారం చిత్రసీమకు ఓ కుదుపు అని, ముందస్తు హెచ్చరికలా అనిపించిందని, ఈ వ్యవహారం వెలుగులోకి తెచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకొంది. అయితే.. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించమని కోరుకొంది. దోషులుగా తేలితే.. ఎవ్వరినీ వదిలిపెట్టమని, తమ వంతు చర్యలు తీసుకొంటామని, తెలంగాణ పోలీసులకు సహకరిస్తామని చెప్పిన చిత్రసీమ మీడియా, పోలీసులు వ్యవహరించిన తీరుకు మాత్రం కాస్త నొచ్చుకొన్నట్టు స్పష్టం చేసింది. ”విలన్ గెలిచిన సినిమాలు తీయలేదు. మా సినిమాలో మంచే చూపిస్తాం. చెడుపై మంచి గెలవడమనే కథలే సినిమాలో ఉంటాయి. డ్రగ్స్ తీసుకొన్నవాళ్లెవరూ హీరోలు కాదు. మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నవాళ్లే చిత్రసీమలో నిలదొక్కుకొంటారు. చెడు వ్యసనాల బారీన పడిన వాళ్లు కాలక్రమంగా కనుమరుగవుతారు. సమాజానికి ఎలాంటి ఉపద్రవం ఎదురైనా… ఆదుకోవడానికి చిత్రసీమ ముందుంటుంది. అలాంటి చిత్రసీమకు కష్టం వచ్చినప్పుడు సమాజం నుంచి, మీడియా నుంచి కాస్త సానుభూతి కోరుకొంటున్నాం” అని ఆ లేఖలో పేర్కొంది. ఈ ఉత్తరాన్ని పవన్ కల్యాణ్ కూడా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.