గతంలో అయితే ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. పదవులు లేకపోయినా సామాజిక కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పాల్గొన్నవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. సమాజానికి సేవ చేయడంలో, సాటి మనిషికి తోడ్పాటు అందించడంలో ఆనందం వెతుక్కోవాలన్న గొప్ప నీతిని భావితరాల వాళ్ళకు అందించేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ సేవ చేస్తున్నాం అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయాలతో టచ్‌లో ఉన్నవాళ్ళ చూపు మాత్రం ఎంతసేపూ కుర్చీపైనే. కులాల, మతాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నామని చెప్పుకు తిరిగే కృష్ణయ్య, ఒవైసీ, ఇక జేఏసీ నాయకులు…అందరూ కూడా అభివృద్ధిని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చూపిస్తున్నవాళ్ళే. మిగతా జనాలకు మాత్రం కేవలం మాటలు చెప్తున్నారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే….సమాజం గురించి ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే చాలు…రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు? పదవులను ఎప్పుడు అధిష్టిస్తాడు అని చెప్పుకోవడం మరీ కామన్ అయిపోయింది.
తన సినిమాల్లో ఏవో రెండు దేశభక్తి పాటలను సందర్భం లేకుండా జొప్పించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద పొలిటీషియన్ అయ్యేదిశగా ప్రస్థానం సాగిస్తున్నాడు. అవే గొప్ప మెస్సేజ్‌లని కూడా ఆయనే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నాడు. ఇక మీడియా ఇంటర్యూలలో సమాజం గురించి నాలుగు మాటలు మాట్లాడే అందరికీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేసే అర్హత వచ్చేస్తుందా? అది కూడా ఎవరు అధికారంలో ఉంటే …వాళ్ళ కొమ్ముకాసే మీడియా అధిపతులను పక్కన పెట్టుకుని సమాజ సేవ చేయడం కోసమే ఉన్నా అని చెప్పడం అతి పెద్ద కామెడీ. ఇక తమిళనాట రజినీకాంత్‌ని రాజకీయాల్లోకి రమ్మనేవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాజకీయాల్లాకి రా…ముఖ్యమంత్రి అయిపో అని చెప్పి ఆహ్వానాలు పలుకుతున్నారు. రజినీకాంత్ కూడా వ్యవహారం కూడా సేం టు సేం. డబ్బులంటే అస్సలు ఇష్టం ఉండదు. యోగిలా బ్రతుకుతూ ఉంటాడు అని చాలా గొప్పగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన సినిమాలను కొన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన స్థాయి నష్టాలు తెచ్చుకున్నా అని పట్టించుకోడు. వ్యాపారంలో లాభ నష్టాలు కామన్ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. మరి అలాంటప్పుడు సినిమాలు ఫ్లాప్ అయితే కొన్నవాళ్ళకు తిరిగి డబ్బులిచ్చే హీరో అని డబ్బా కొట్టుకోవడం ఎందుకు? ఇక ఈ మధ్య కమల్ హాసన్‌ని కూడా ఓ రేంజ్లో ఎత్తేస్తోంది మీడియా. ఆయన కూడా మీడియా వాళ్ళ భజనకు పడిపోయినట్టున్నాడు. ఏకంగా మహాభారతం గురించే తనకు తోచింది మాట్లాడేశాడు. కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి వచ్చి అర్జెంట్‌గా కుర్చీ ఎక్కేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ఇక లేటెస్ట్గా తెలుగు హీరో మంచు మనోజ్‌ని కూడా ఆ లిస్టులో చేర్చేశాడు పోసాని. అర్జెంట్‌గా మంచు మనోజ్‌ని ముఖ్యమంత్రిని చేసేయమని మోహన్‌బాబుకు సలహా ఇచ్చాడు. అదేదో షాపుకెళ్ళి చాక్లెట్ తెచ్చివ్వు అన్నంత సింపుల్‌గా చెప్పేశాడు పోసాని. మంచు మనోజ్ కూడా అత్యాచర ఘటనలు లాంటివి జరిగినప్పుడు ఆవేశంగా రెస్పాండ్ అవుతూ తన ఆఫ్ స్క్రీన్ హీరోయిజం చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఈ జాబితాలో ఎందరో?
2009కి ముందు సిఎం అయిపోతా…సిఎం అయిపోతా….నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు అన్న ఒకాయన మాత్రం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ప్రజాసేవ విషయంలో వీళ్ళకు ఉండే చిత్తశుద్ధి అంత. మాటలు మా గొప్పగా చెప్తారు. ఆ మాటలన్నీ కూడా పదవులు పొందడం కోసమే. పొరపాటున ఆ పదవి రాలేదా…ఇక ప్రజా జీవితానికి స్వస్థి పలికేస్తారు. ఇలాంటి సినిమా నాయకులను ఇప్పటికే చాలా మందిని చూసేశాం. ఇంకా ఎంతమంది ఈ లిస్టులో యాడో అవుతూ ఉంటారో చూడాలి.