థియేటర్ వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. కరోనాకి ముందు వరకూ… థియేటర్ల పరిస్థితి అంతంత మాత్రమే. ఇప్పుడు కరోనా వల్ల… మరింత దారుణంగా తయారైంది. భవిష్యత్తంతా ఓటీటీలదే అనిపిస్తున్న ఈ తరుణంలో థియేటర్ వ్యవస్థ మళ్లీ పుంజుకోవడం అత్యంత క్లిష్టమైన విషయంగా కనిపిస్తోంది. థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయన్నది వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ లీజు పద్ధతిలోనే నడుస్తున్నాయి. థియేటర్లు గుత్తగా లీజుకు తీసుకుని, వాటికి మరమత్తులు చేసి, హంగులు జోడించి `ఆ నలుగురు` నడిపించుకుంటున్నారు. 2020 మొత్తం సినిమాల్లేక ఇప్పుడు థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడూ అదే పరిస్థితి. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేని వాతావరణం. యేళ్లకు ఏళ్లు థియేటర్లని పెంచి, పోషించడం, జీతాలు ఇవ్వడం చాలా కష్టంగా మారుతోంది. అందుకే లీజు అగ్రిమెంట్లని కాన్సిల్ చేయించుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో గుత్తేదార్లు ఉన్నారని టాక్.
విశాఖపట్నంలోని కొన్ని థియేటర్లు ఓ సినీ ప్రముఖుడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆలీజు ఎగ్రిమెంట్లన్నీ రద్దు చేసే పనిలో ఆ నిర్మాత బిజీగా ఉన్నారని టాక్. ఆ లెక్కన.. థియేటర్లు ఇప్పుడు సొంతదార్లకే చెందుతాయి. థియేటర్లు లీజుకు తీసుకుని, లక్షల్లో పెట్టుబడి పెట్టి, వాటిని పునరుద్ధరించారు గుత్తేదార్లు. ఇప్పుడు ఆ పెట్టుబడిని సైతం వదులుకోవడానికి సిద్ధమయ్యారట. రాష్ట్రంలోని అన్ని లీజు థియేటర్లూ త్వరలోనే… సొంత దారుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. `ఆ నలుగురి చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి` అనే మాట.. ఇక ముందు వినిపించదేమో..?