బాక్సాఫీసు దగ్గర గడ్డు రోజులు నడుస్తున్నాయిప్పుడు. పెద్ద సినిమాల హడావుడి లేదు. చిన్న సినిమాలు మెరవడం లేదు. వారానికి మూడు సినిమాల చొప్పున వస్తున్నా… వాటిలో మెరుస్తున్నవేం కనిపించడం లేదు. థియేటర్ల దగ్గర జనమే లేకుండా పోయారు. దానికి తోడు ఈ వారం అసలు సినిమాలేం రావడం లేదు. దానికి కారణం బంద్ భయమే. సర్వీస్ప్రొవైడర్ల దౌర్జన్యానికి చమరగీతం పాడాలన్న ఉద్దేశంతో దక్షిణాది మొత్తం ఏకమై బంద్కు పిలుపు ఇచ్చింది. మార్చి 2 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిశ్చయించాయి. సర్వీస్ ప్రొవైడర్లతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో… బంద్ తప్పేలా లేదు. ఆభయంతోనే మార్చి 2న రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్లాయి.
శ్రీదేవి మరణం నేపథ్యంలో చిత్రసీమ మొత్తం ఆ టాపిక్పైనే దృష్టి పెట్టింది. బంద్ గురించిన ఊసే లేదు. ఈలోగా సర్వీస్ప్రొవైడర్లతో మరోసారి చర్చలు జరుగుతాయేమో అనుకున్నారు. ఆ ఇష్యూకి శ్రీదేవి మరణం బ్రేకులు వేసింది. మరోవైపు మార్చి 2 తరుముకొస్తున్న నేపథ్యంలో ఈలోగా సర్వీస్ ప్రొవైడర్లు దిగి వస్తారనుకోవడం అత్యాసే అవుతుంది. సో… మార్చి 2 నుంచి థియేటర్లు మూత పడడం ఖాయం. అయితే ఇది ఎన్నిరోజులు అనేదే కీలకం. మార్చి చివరి రెండోవారం నుంచి కొత్త సినిమాల జోరు మొదలవుతుంది. మార్చి నుంచి మే వరకూ కొత్త సినిమాల జాతరే. అందులో పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. ఈ బంద్ వీలైనంత త్వరగా ముగియాలి. లేదంటే.. సమ్మర్ డేట్లు ఫిక్స్ చేసుకున్న సినిమాల్లో కంగారు మొదలవుతుంది. బంద్ పదిహేను రోజులు కొనసాగింది అనుకుందాం.. ఆ టైమ్లో రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్లాయి. దాంతో టైమ్ టేబుల్లో గందరగోళం నెలకుంటుంది. అందుకే ఇటు నిర్మాతలు, అటు సర్వీస్ ప్రొవైడర్లు మాధ్యే మార్గంగా ఓ నిర్ణయానికి రావల్సిన అవసరం ఉంది. లేదంటే చిత్రసీమపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు పస్తులుండాల్సిందే.