ఈనెల 22 నుంచి బాక్సాఫీసు దగ్గర దసరా సందడి మొదలైపోతోంది. జై లవకుశతో.. తెలుగు సీమకు దసరా ముందుగానే వచ్చేస్తోంది. ఆ తరవాత..స్పైడర్ ఉండనే ఉంది. 29న మహాను భావుడు విడుదలకు సిద్ధమవుతోంది. అంటే… సెప్టెంబరు ద్వితీయార్థం అంతా బాక్సాఫీసు కళకళలాడిపోతోందన్నమాట. చిన్న సినిమాల విడుదలకు ఈనెల 15నే కాస్త తీరిక దొరికంది. అది దాటితే… మరో నెల రోజుల వరకూ సినిమాని విడుదల చేసుకొనే ఛాన్సులుండవు. అందుకే చిన్న సినిమాలు త్వర పడుతున్నాయి. ఈనెల 15న ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీసు ముందు క్యూ కట్టబోతున్నాయి.
ఉంగరాల రాంబాబు, వీడెవడు, శ్రీవల్లీ, కథలో రాజకుమారి.. విడుదలకు ముస్తాబవుతున్న సినిమాలు. సునీల్ హీరోగా వస్తున్న సినిమా కాబట్టి, ఉంగరాల రాంబాబు పై బీ,సీలో దృష్టి పెట్టొచ్చు. కథలో రాజకుమారి మల్టీప్లెక్స్ ఆడియన్స్ టార్గెట్ చేయొచ్చు. వీడెవడు, శ్రీవల్లికీ థియేటర్లు దొరికాయి. అవేమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయో చూడాలి. నాలుగు సినిమాల్లో ప్రమోషన్ పరంగా రాంబాబే కాస్త బెటర్‌గా ఉన్నాడు. గతవారం విడుదలైన రెండు సినిమాలూ.. రెండో రోజుకే తుస్సుమన్నాయి. జై లవకుశ వరకూ.. థియేటర్ల దగ్గర సందడి ఉండదేమో అనుకొన్నారు. కానీ నాలుగు సినిమాలూ ఒకేసారి సిద్ధమవ్వడంతో ఈ వారం సినీ హంగామా బాగానే కనిపించబోతోంది. మరి ఈ నాలుగులో… నిలిచేదెవరో చూడాలి.