అన్ లాక్ 5లో భాగంగా థియేటర్లు తెరచుకుంటాయన్న ఆశాభావంలో ఉంది చిత్రసీమ. కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేటర్లకు అనుమతులు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాకపోయినా అక్టోబరు రెండో వారంలో థియేటర్లు ఓపెన్ అవ్వొచ్చు అన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే అనుమతులు వచ్చినంత మాత్రాన కొత్త సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితుల్లో నిర్మాతలు లేరు. ఎందుకంటే రిలీజ్ చేశాక… జనాలు థియేటర్లకు రాకపోతే పరిస్థితి ఏమిటన్నది అందరి భయం. పైగా 50 శాతం ఆక్యుపెన్సీతో సరిపెట్టుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.
అందుకే… ట్రైల్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన కొన్ని సినిమాల్ని థియేటర్లలో రీ – రిలీజ్ చేయాలన్నది నిర్మాతల ప్లాన్. వి, పెంగ్విన్, కృష్ణ అండ్ హిజ్ లీల, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య లాంటి చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలయ్యాయి. వీటిలో కొన్నింటిని థియేటర్లలో కూడా విడుదల చేసి, ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో.. చూడాలన్నది ప్లాన్. ఓటీటీలో విడుదలైనా – జనాలు థియేటర్లకు వచ్చి, సినిమా చూడాలన్న ఉత్సాహం చూపితే అది కచ్చితంగా నిర్మాతలకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. అసలు ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చే మూడ్ ఉందా, లేదా? అని తెలుసుకోవడానికి ఇదో ట్రైయిల్ ఆపరేషన్ అనుకోవాలి. దసరా, దీపావళి సీజన్లపై చిత్రసీమ ఇప్పుడు ఆశలు పెట్టుకుంది. ఎంత లేదన్నా.. ఆ సమయానికి థియేటర్లు తెరచుకుని, ప్రేక్షకుల్లోనూ కొత్త సినిమాలు చూడాలన్న ఆసక్తి పెరుగుతుందని చిత్రసీమ భావిస్తోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.