సినిమాల జాతర మొదలైంది. ప్రతీ వారం.. థియేటర్ దగ్గర కొత్త పోస్టర్లు తళతళలాడబోతున్నాయి. గత వారం `ఉప్పెన` ఒకటే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ శుక్రవారం మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు డబ్బింగ్ బొమ్మలు కూడా ఉన్నాయి.
నరేష్ `నాంది` ఈనెల 19న విడుదల అవుతోంది. ఈ సినిమా నరేష్‌కి అత్యంత కీలకం. ఓ రకంగా నరేష్ పూర్తి స్థాయి సీరియస్ పాత్ర చేసిన సినిమా ఇదే. ట్రైలర్ చూస్తే.. ఓ మంచి కోర్టు డ్రామా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతోంది. తన పాత ధోరణికి భిన్నంగా చేసిన సినిమా కాబట్టి… నరేష్ కూడా నాందిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అదే రోజున సుమంత్ `కపటధారి` రిలీజ్ అవుతోంది. ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ తరహా చిత్రాలు తెలుగులో బాగానే ఆడుతున్నాయి మధ్య. ట్రైలర్ చూస్తుంటే…సుమంత్ కూడా సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టినట్టే కనిపిస్తోంది.
అదే రోజున రెండు డబ్బింగ్ బొమ్మలు వస్తున్నాయి. అందులో విశాల్ `చక్ర` ఒకటి. ఓ తెలివైన దొంగకీ, మిటలరీ అధికారికీ మధ్య జరిగే పోరాటం ఇది. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. విలన్ ఎవరన్నది ఇప్పటి వరకూ చూపించలేదు. ఆ పాత్ర చుట్టూ నడిచే డ్రామా, సస్పెన్స్ ఆసక్తి కరంగా ఉంటుందంటున్నారు. అయితే ఈ సినిమా విడుదల పై మద్రాస్ హై కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ… ఈ సినిమాకి బ్రేక్ పడినట్టే. ఈలోగా.. విశాల్ ఈ వివాదాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కన్నడ డబ్బింగ్ సినిమా `పొగరు` కూడా ఈవారమే వస్తోంది. రష్మిక కథానాయిక కావడంతో.. ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. `కేజీఎఫ్` తరవాత కన్నడ సినిమాలకు తెలుగులో మార్కెట్ మొదలైంది. ఈ సినిమా కూడా హిట్టయితే… కన్నడ చిత్రాలు వరుస కడతాయి.