ఏం మరీ అంత… గా కనిపిస్తున్నామా..? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా..? .. అంటూ అనుకోకుండా ఓ రోజులో చక్రవర్తిని ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్ సూపర్ పాపులరయింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల్ని ఉద్దేశించి జనసైనికులు ఇదే మాట చెప్పుకుంటున్నారు. తమను ఉద్దేశించి చేసిన మాటల్ని వెనక్కి తీసుకోవాలంటూ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఇదంతా ఎందుకంటే… పవన్ కల్యాణ్‌ను.. జనసేనను.. బీజేపీ నేతలు పూచిక పుల్ల కన్నా ఘోరంగా తీసి పడేస్తున్నారు. అనరాని మాటలు అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున కీలకంగా ప్రచారం చేస్తున్న నేతల్లో ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జనసేనను దారుణంగా తీసి పడేశారు. జనసేనతో పొత్తూగిత్తూ లేదన్నారు. అసలు తెలంగాణలో బీజేపీకి ఎవరితోనూ పొత్తు లేదన్నారు. అంతటితో వదిలి పెట్టలేదు. తాము వెళ్లి పవన్ కల్యాణ్‌ను మద్దతు అడగలేదని.. ఆయనే సంఘిభావం ప్రకటించారని చెప్పుకొచ్చారు. దీంతో కాక ప్రారంభమయింది. అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసైనికులు నొచ్చుకోవడం ప్రారంభించారు. బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారు.
అయితే.. ఎంపీ స్థానంలో ఉన్న నేత.. పవన్ కల్యాణ్‌ను.. జనసేనను అంతగా కించపర్చినా… పై స్థాయి నుంచి స్పందన లేకపోతే.. కష్టమని ఫీడ్ బ్యాక్ వచ్చిందేమో కానీ… ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ జనసేన బాధ్యతలు చూస్తున్న శంకర్ గౌడ్ .. అరవింద్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. అరవింద్ చెప్పినట్లుగా పవన్ కల్యాణ్ స్వచ్చందంగా పోటీ నుంచి వైదొలగలేదని.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు ప్రత్యేకంగా వచ్చి.. పవన్ కల్యాణ్ ను రిక్వెస్ట్ చేసినందుకే వైదొలిగామని చెప్పుకొచ్చారు.
పొత్తుల్లో ఉన్నామని జనసేన నేతలు చెప్పుకుంటారు కానీ.. అలాంటిదేమీ లేదని బీజేపీ నేతలు చెప్పడం అంటే.. జనసైనికుల్ని అవమానించడమే. పోటీకి సిద్ధమై నామినేషన్లు వేసిన తరవాత ఇలా వైదొలిగితే.. ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయని.. అంటున్నారు. రాజకీయాల్లో గౌరవం ఎవరూ ఇవ్వరు. మనం ఎంత విలువ నిలుపుకుంటామో.. అంతే దక్కుతుంది. ఆ విషయం ఇప్పుడిప్పుడు జనసైనికులకు తెలిసొస్తోంది. జనసేనానికి ఎప్పుడు తెలుస్తుందో మరి..!?