మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో తానే ముందున్నందున తనకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఈటల రాజేందర్
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా… మల్కాజ్ గిరి ఎంపీ స్థానం విషయంలో ఎంతో మంది పోటీపడినా బీజేపీ అధినాయకత్వం ఈటల వైపే మొగ్గు చూపింది. ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ కూడా ఈటలకే ఉండటంతో… మల్కాజ్ గిరి నుండి ఈటలకే టికెట్ వచ్చింది. ఆయన కూడా భారీ మెజారిటీతో గెలిచారు. రాష్ట్రం నుండి 8మంది ఎంపీలు గెలిచిన నేపథ్యంలో కిషన్ రెడ్డితో పాటు మరో ఇద్దరికీ మంత్రి పదవులు వస్తాయని… బండి సంజయ్ తో పాటు ఈటలకు కూడా అవకాశం ఉంటుందని చివరి వరకు ప్రచారం జరిగింది. కానీ ప్రధాని మోడీ, అమిత్ షాలు ప్రస్తుతానికి రాష్ట్రానికి రెండే పదవులు ఇవ్వటంతో ఈటలకు ఛాన్స్ రాలేదు. ప్రమాణస్వీకారానికి ముందు రోజు అమిత్ షా ఈటలను పిలిపించి మాట్లాడటంతో ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తారని అంతా ఫిక్స్ అయ్యారు.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అధ్యక్షపదవిలో కొనసాగుతున్నారు. బీజేపీలో రెండు పదవులు చేపట్టరాదన్న నియమం ఉంది. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం ఈటలతో పాటు పలువురు పోటీలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్త వారు రాబోతుండటంతో అప్పటి వరకు రాష్ట్ర అధ్యక్ష నియామకం హోల్డ్ చేసినట్లు కనపడుతోంది.
అయితే, అప్పటి వరకు తాను కామ్ గా ఉండకుండా ఈటల రాజేందర్ ఇప్పటికే గేర్ మార్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శల విషయంలో చాలా మంది బీజేపీ నేతలు టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారే తప్పా ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. కానీ, కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ ప్రభుత్వంపై దూకుడు పెంచారు. సర్కార్ నిర్ణయాలపై విమర్శలు మొదలుపెట్టారు. రైతు రుణమాఫీ, గ్రేటర్ పరిధిలో ఇండ్ల నిర్మాణాల కూల్చివేత సహ పలు అంశాల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయటంతో… అధ్యక్ష రేసులో ముందున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.