ఇన్నాళ్లకు టీడీపీ స్వరం పార్లమెంటులో ఘాటెక్కింది..! మిత్రధర్మం అంటూ ఇన్నాళ్లూ పొత్తు తెగకూడదన్న తరహాలో మాట్లాడుతూ వచ్చిన టీడీపీ… ఇప్పుడు అదే ధర్మాన్ని పాటించాలంటూ భాజపాను గట్టిగా నిలదీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా ఘాటుగా ధీటుగా ప్రశ్నిస్తూ… సమాధానాలు చెప్పాలంటూ నిలదీశారు గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్. మిత్రధర్మాన్ని చాలా ఓపికతో పాటిస్తున్నామనీ, భాజపా కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని డిమాండ్ చేశారు. భాగస్వామ్య పక్షాన్ని నిలదీయడం తమకు తప్పడం లేదనీ, ఇది సంతోషంతో చేస్తున్న పని కాదనీ, మరో ప్రత్యామ్నాయం లేకుండా మీరే చేశారంటూ ప్రధానిని ఉద్దేశించి జయదేవ్ అన్నారు.
‘మీ నిర్లక్ష్య వైఖరి ద్వారా మిత్రపక్షాలకు ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రధానమంత్రి గారూ’ అంటూ సూటిగా మోడీ లక్ష్యంగానే జయదేవ్ మాట్లాడటం విశేషం. ‘మీ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం నిరాదరణకు గురౌతోంది. ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారు, కించపరుస్తున్నారు’ అంటూ తీవ్రంగా స్పందించారు. అమరావతి, పోలవరం, రైల్వేజోన్, ఆర్థిక లోటు, ప్రత్యేక ప్యాకేజీ… వీటితోపాటు విభజన చట్టంలో ప్రస్థావించిన అంశాలేవీ కేంద్ర బడ్జెట్ లో లేవని జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలుగుదేశం ఆంధ్రాలో నిరాదరణకు గురౌతుందనీ, భాజపా అనూహ్యంగా ఎదుగుతుందనేది కొంతమంది భాజపా నేతల అభిప్రాయంగా ఉందేమో అన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుభవమైందని అన్నారు. ఆంధ్రా ప్రజల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ కు ఎదురైన పరిస్థితే భాజపాకి వస్తుందన్నారు.
ప్రజలను మరోసారి ఫూల్స్ ను చేసేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. బడ్జెట్ కేటాయింపులు అద్భుతం అని పొగుడుతూ భాజపాకి అనుకూలంగా మాట్లాడుతూ… ఏపీ సర్కారుపై నింద మోపే ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే, ఆంధ్రా ప్రజలు అమాయకులు కారనీ.. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికేందుకు వైకాపా సిద్ధంగా ఉంటుందని అందరికీ తెలుసు అని జయదేవ్ చెప్పారు. తమ నాయకుడు జైలుకు వెళ్లకుండా ఉండాలన్నదే వారి ఏకైక అజెండా అన్నారు. అవినీతికి పోస్టర్ బాయ్ గా నిలిచే అధ్యక్షుడున్న అలాంటి పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరిస్తూ… దేశ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ భాజపాను ప్రశ్నించారు. తమ ముఖ్యమంత్రి ఇంతవరకూ 29 సార్లు ఢిల్లీకి వచ్చారనీ, ప్రధాని, ఆర్థికమంత్రి, హోం మంత్రితోపాటు ఎంతోమందిని కలిశారనీ… కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు అని జయదేవ్ గుర్తు చేశారు. కానీ, నాలుగేళ్ల తరువాత.. ఇప్పుడు స్పందిస్తూ ఇంకా పరిశీలిస్తున్నామని కుంటిసాకులు చెబుతూ ఉండటం సిగ్గు చేటు అని ఘాటుగా చెప్పారు.
ఆంధ్రాకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ… ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆర్థికమంత్రి రెండేళ్ల కిందట చెప్పారన్నారు. కానీ, అప్పట్నుంచీ ఏదీ జరగలేదనీ, తమ సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోందన్నారు. కనీసం ఈ బడ్జెట్ లో ప్రత్యేక ప్యాకేజీ నిధుల ప్రస్థావన లేకపోవడం అన్యాయమనీ, ఆంధ్రులను నిలువునా మోసం చేయడమే ఇది అన్నారు. రైల్వేజోన్, విజయవాడ విశాఖ మెట్రోల ప్రస్థావనే బడ్జెట్ లేదనీ, ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అంటూ ఎద్దేవా చేశారు. నిన్న ఇదే అంశమై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారనీ, నాలుగేళ్ల తరువాత ఇప్పుడు తీరిగ్గా పరిశీలిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ లో ఆంధ్రాకు కేటాయించింది రూ. 1840 కోట్లు మాత్రమే అనీ, బాహుబలి సినిమా కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని చమత్కరించారు! ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పాస్ చేసినందుకు కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు సున్నా సీట్లు ఇస్తే… కనీస అవసరాలు కూడా తీర్చని భాజపా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ హెచ్చరించడం విశేషం. పొత్తును కొనసాగించుకోవాలంటే భాజపా ముందున్న ఆఖరి అవకాశం ఇదే అంటూ గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ముగించారు.