రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి సారథి కవిత హైదరాబాదులో రౌంగ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. కవితతో పాటు ఎంతో మంది మానవత్వంతో స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదుకుందామని కవిత పిలుపునిచ్చారు. వారి అప్పులను తీర్చడంతో పాటు పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత తీసుకుందామని చెప్పారు. కవిత నిర్ణయంలోని మానవీయ కోణాన్ని అభినందించాల్సిందే. ఒక వ్యక్తిగా, మహిళగా, తల్లిగా ఆమె ఆలోచించారు. అయితే ఇందులో ఓ పెద్ద లోపం ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా ఉందీ ప్రయత్నం.
మనిషి మరణించిన తర్వాత ఎన్నిచేస్తే ఏం లాభం? పోయిన మనిషి తిరిగిరాడు. ఆ ఆవేదన ఆ కుటుంబాన్ని జీవితాంతం వెంటాడుతుంది. అప్పుడు దయగలదాతలు దత్తత తీసుకుని అప్పులు తీర్చి, పిల్లలకు చదువు చెప్పించడం కవిత ఆలోచనలోని ఉద్దేశం. అసలు రైతు ఆత్మహత్య జరగని విధంగానూ ప్రయత్నించవచ్చు. నిజంగా, రైతుల అప్పులు తీర్చే స్థాయిలో ఇక్కడి సంపన్నులు, ఎన్నారైలు, కవిత వంటి వారు ముందుకు వస్తే, ఆత్మహత్యలను నివారించడం సులభం. ప్రభుత్వాన్ని కదిలిస్తే ఇది సాధ్యమే. రైతు ఆత్మహత్యలకు ప్రధానా కారణాలు రెండు. మొదటిది- అప్పుల భారం. రెండోది- కరువు వల్లో అకాల వర్షాల వల్లనో పంట నష్టం.
పంటనష్టానికి పరిహారం ఇవ్వడం, బీమా సొమ్ము ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత. అది సరిగా జరగాలి. ఇక, అప్పుల బాధ విషయంలో హెల్ప్ లైన్ కీలక పాత్ర పోషించాలి. బ్యాంకు రుణమైతే ప్రభుత్వం రంగంలోకి దిగి రైతుకు సాయం చేయాలి. రుణం రీషెడ్యూలు చేయించడమా మరో విధంగానా అనేది ఆలోచించి రైతుకు కొంత కాలం భారం లేకుండా చేయాలి. ప్రయివేటు అప్పు అయితే గనక, రుణదాతనుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొనే వారు చనిపోకుండా చూడాలి. ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి దానికి ఫోన్ చేయమని చెప్పాలి.
రైతును వేధించే అప్పుల వాళ్ల వివరాలను సేకరించడానికి స్థానికంగా వాలంటీర్ట బృందాన్ని ఏర్పాటు చేయాలి. రుణదాతలతో మాట్లాడి కొంత గడువు ఇప్పించాలి. నిజంగానే రుణదాతకు డబ్బు అత్యవసంర అయితే, కవిత చెప్పినట్టు స్థానిక సంపన్నులు లేదా ఎన్నారైలు అందుకు సహాయం చేయాలి. మనిషి ఆత్మహత్య చేసుకున్న తర్వాత లక్షల అప్పు తీర్చడానికి బదులు, ఇలా మరణానికి ముందే తమకు భరోసా ఉంటుందని తెలిస్తే ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు. ఈ తరహాలో ప్రయత్నిస్తే కవిత ప్రయత్నం పూర్తిగా సఫలమవుతుంది.
ఆ దిశగా కవిత ఆలోచిస్తే రైతులోకానికి మేలు కలుగుతుంది. అన్నదాత బలవన్మరణాలను ఆపిన దయామయిగా ఆమె పేరు చిర స్థాయిగా నిలిచిపోతుంది.