ఎంపి కీర్తి ఆజాద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై అయన తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేస్తున్నప్పుడు, కీర్తి ఆజాద్ కూడా ఆయనతో గొంతు కలిపి జైట్లీపై విమర్శలు గుప్పించారు. తనపై కూడా పరువు నష్టం దావా వేయమని జైట్లీకి సవాలు విసిరారు. బీజేపీ అధిష్టానం ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏమాత్రం తగ్గకుండా విమర్శలు గుప్పిస్తుండటంతో తప్పనిసరిగా సస్పెన్షన్ వేటు వేయవలసి వచ్చింది. ఆయన బిహార్ లోని దర్బంగా లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై కీర్తి ఆజాద్ స్పందిస్తూ “డీడీసీఏలో అనేక అక్రమాలు జరిగాయనే నా మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. కంప్యూటర్లు మొదలుకొని చిన్న చిన్న వస్తువుల కొనుగోలు వరకు ప్రతీదానిలో అక్రమాలు జరిగాయి. ఎటువంటి టెండర్లు పిలవకుండానే లక్షల రూపాయలు విలువ చేసే పనులను ముక్కూ మొహం తెలియని సంస్థలకు అప్పగించేశారు. ఈ అవినీతి బాగోతాలు నేనే కాదు ‘వికీ లీక్స్’ కూడా బయటపెట్టింది అని చెప్పి దానికి సంబంధించిన వీడియోని కూడా ప్రదర్శించి చూపారు. తను అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే పోరాడుతున్నాను తప్ప ఎవరో వ్యక్తులను టార్గెట్ చేసుకొని కాదని అన్నారు. తనపై సస్పెన్షన్ విధించడం చాలా దురదృష్టకరమని అన్నారు.