గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నేత, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన.. వంటేరు ప్రతాప్ రెడ్డి… ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు స్పష్టమైన సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈ సమాచారం.. ఎలా బయటకు వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. వంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రం.. దీన్ని ఖండించడం లేదు. ఎవరైనా.. తనపై ఇలా ప్రచారం జరిగితే…. అది మైండ్ గేమ్ అని తోసి పుచ్చి.. అబద్ధం అనేస్తారు. కానీ.. వంటేరు ప్రతాప్ రెడ్డి కానీ.. ఆయన అనుచరులు కానీ.. ఒక్కరు కూడా దీన్ని ఖండించలేదు. దాంతో.. వంటేరు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని తేలిపోయింది. అందుకే మీడియా కూడా నిర్ధారించేసింది. అయితే అనూహ్యంగా.. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఖండన ప్రకటన విడుదల చేశారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లోకి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని.. ఆయనే… తాను టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి… మెదక్ ఎంపీగా ఉన్నారు. 2014లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ తో పాటు… గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి… ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో వచ్చి న ఉపఎన్నికలో…. కొత్త ప్రభాకర్ రెడ్డికి చాన్సిచ్చారు కేసీఆర్. ఆ తర్వాత.. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకంగా మారారు. గత ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు కేసీఆర్… ఆయనకే అప్పజెప్పారు. సాధారణంగా అయితే హరీష్ రావు చూసుకునేవారు కానీ.. హరీష్ తో పాటు.. కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. అంటే.. ఆయనపై కేసీఆర్కు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడా కొత్త ప్రభాకర్ రెడ్డి… వంటేరును పార్టీలో చేర్చుకోబోమని ప్రకటిస్తున్నారు. అయితే.. వంటేరు.. పార్టీలో చేరుతున్నట్లు.. చర్చలు పూర్తయినట్లుగా మూడో కంటికి తెలియదు. అందుకే.. కొత్త ప్రభాకర్ రెడ్డి అలా స్పందిస్తున్నారని కొంత మంది టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక వేళ వంటేరు ప్రతాప్ రెడ్డి చేరితే… మొదటగా.. ఇబ్బంది పడేది కొత్త ప్రభాకర్ రెడ్డేనని.. అందుకే.. వ్యతిరేకిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. మెదక్ ఎంపీగా.. ఆయనకు టిక్కెట్ దాదాపు ఖాయమే. అయితే కేసీఆర్ పార్లమెంట్ కు పోటీ చేయాలంటే.. మెదక్ నుంచి పోటీ చేస్తారు. అప్పుడు టిక్కెట్ త్యాగం చేయక తప్పదు. అలా త్యాగం చేసినా… కేసీఆర్ ఖాళీ చేసిన గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి చాన్స్ వస్తుంది. ఇప్పుడు వంటేరు పార్టీలో చేరితో.. ఆ చాన్సులు ఆయనకు వెళ్తాయన్న ఆందోళనతోనే.. ఇలా వంటేరుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని.. టీఆర్ఎస్లోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏది నిజమో… సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.