హైదరాబాద్: రేణిగుంట విమానాశ్రయంలో ప్రభుత్వోద్యోగి రాజశేఖర్‌ను చితకబాదారన్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న రాత్రి చెన్నైలో అరెస్ట్ చేయటంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. చిత్తూరు, కడప జిల్లాలలో ఇవాళ ఉదయంనుంచి వైసీపీ నాయకులు ఆందోళనలను ప్రారంభించటంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మిథున్ రెడ్డి, ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావటంతో ఆ జిల్లాలో ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, మరో ఎంపీ వరప్రసాద్ల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. వీరిని రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు రోజా మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపించారు. తనపై సంవత్సరంపాటు సస్పెన్షన్ విధించారని, రేణిగుంట విమానాశ్రయంలో వివాదానికి సంబంధించి మిథున్‌రెడ్డికి ఆ ప్రభుత్వోద్యోగి సారీ చెప్పినప్పటికీ అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభుత్వోద్యోగిపై దౌర్జన్యం చేయించినప్పటికీ అతనిపై కేసుపెట్టలేదని దుయ్యబట్టారు. కాల్‌మనీ కేసులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. బెదిరింపు కేసులకు తాము భయపడబోమని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, విపక్షనేతలపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
నవంబర్ 26న రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఒక గొడవలో ప్రభుత్వోద్యోగి రాజశేఖర్‌పై మిథున్ రెడ్డి, ఆయన పార్టీ అనుచరులు చేయి చేసుకున్నారని, దారుణంగా కొట్టారని ఆరోపణ. అయితే మిథున్ రెడ్డి మాత్రం ఎటువంటి గొడవా జరగలేదని, అసలు విమానాశ్రయంలో రాజశేఖర్ అనే ఉద్యోగే లేరని మీడియాతో అన్నారు. తర్వాత విమానయాన శాఖ కేసు నమోదు చేయాలని తమ ఉద్యోగులను ఆదేశించటంతో ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. విమానాశ్రయంలోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మిథున్ రెడ్డి హైకోర్టుతోసహా పలు కోర్టులలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లభించలేదు. నిన్న విదేశాలనుంచి వస్తున్న మిథున్ రెడ్డిని చిత్తూరు పోలీసులు చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.